ఒంగోలు సిటీ: విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులందరినీ సమన్వయం చేసుకుని..సమగ్ర ప్రణాళికలతో ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రభుత్వ పాఠశాలను ప్రైవేటుకు స్కూళ్లకు దీటుగా నిలబెట్టారు ఒంగోలు పీవీఆర్ మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల హెచ్‌ఎం మువ్వ రాధిక. ఆమె సేవలను గుర్తించిన ప్రభుత్వం రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపిక చేసింది. ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో నమ్మకాన్ని పెంచేలా విద్యా ప్రమాణాలను ఆమె మెరుగుపరిచారు. విద్యార్థులపై వ్యక్తిగత శ్రద్ధ పెట్టారు. ఫలితంగా ప్రస్తుతం పాఠశాలలో 607 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. విద్యార్థుల హాజరు శాతాన్ని కూడా గణనీయంగా పెంచగలిగారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంచేందుకు పాఠశాలలో రాత్రి స్టడీ తరగతులు, ప్రత్యేక తరగతులు అమలు చేస్తున్నారు. విద్యార్థుల స్థాయికి అనుగుణంగా బోధిస్తూ వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఫలితంగా గత ఏడాది పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఈ పాఠశాల 94 శాతం ఉత్తీర్ణత సాధించింది. 585, 584 మార్కులతో నగరంలో ప్రథమ, ద్వితీయ స్థానాలను పాఠశాల విద్యార్థులు కై వసం చేసుకున్నారు. విద్యార్థుల విద్యా ప్రగతి, హాజరు, అభ్యసన స్థాయి తదితర అంశాలను తల్లిదండ్రులకు వివరించడంతో పాటు వారి సూచనలు, అభిప్రాయాలను స్వీకరిస్తున్నారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపిక చేయడం ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరి సమష్టి కృషికి దక్కిన గౌరవంగా భావిస్తున్నానని మువ్వ రాధిక పేర్కొన్నారు.


