బల్లికురవ: జల్సాలకు అలవాటుపడి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లో రాగి వైరు చోరీ చేయడానికి యత్నించిన ఓ దొంగ విద్యుత్ షాక్‌తో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సోమవారం అర్ధరాత్రి బల్లికురవ మండలంలోని గొర్రెపాడు నుంచి కొత్తూరు వెళ్లే రోడ్డులో ఈ ఘటన జరిగింది. కొత్తూరు గ్రామానికి చెందిన తన్నీరు నరసింహారావు సులభంగా డబ్బు సంపాదించేందుకు దాదాపు 15 ఏళ్లుగా ఆలయాల్లో హుండీలు పగలగొట్టడం, ట్రాన్స్‌ఫార్మర్లలో రాగి వైర్లు దొంగిలించడమే వృత్తిగా ఎంచుకున్నాడు. ఈ క్రమంలోనే సంతమాగులూరు, ముండ్లమూరు పోలీస్ స్టేషన్లలో అతనిపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. కాగా, తాజాగా ట్రాన్స్‌ఫార్మర్‌లో రాగి వైర్లు తొలగిస్తుండగా విద్యుత్ ప్రసారమై షాక్‌తో మృతి చెందాడు. మంగళవారం విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై వై. నాగరాజు కేసు దర్యాప్తు చేపట్టారు.
బల్లికురవ: చెల్లెల్ని అత్తగారింట దింపి బైక్‌పై తిరిగి వస్తున్న యువకుడు ప్రమాదవశాత్తు విద్యుత్స్తంభాన్ని ఢీకొట్టి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ఘటన సోమవారం రాత్రి వినుకొండ – కొప్పెరపాడు ఆర్‌అండ్‌బీ రోడ్డులోని గొర్రెపాడు గ్రామ సమీపంలోని వెంపరాల మేజర్ కాలువ వద్ద చోటుచేసుకుంది. పల్నాడు జిల్లా మురికిపూడి గ్రామానికి చెందిన మేక ఆనంద్ (26).. ఉమ్మడివరం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై వై. నాగరాజు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ఆసుపత్రికి తరలించారు.
పీసీపల్లి: మండలంలోని చిన్నవరిమడుగు గ్రామానికి చెందిన పసల శ్రీహరి (18), బుడ్డారెడ్డిపల్లి ఎస్సీ కాలనీకి చెందిన కోనంకి అనూక్ మారెళ్ల చెరువు బ్రిడ్జి వద్ద వేగంగా వస్తున్న కారు ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలయ్యారు. అగత నెల 23 నుంచి 31వ తేదీ వరకు కనిగిరి, ఒంగోలు, గుంటూరులోని ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన శ్రీహరి సోమవారం మరణించినట్లు బంధువులు తెలిపారు. చేతికొచ్చిన ఒక్కగానొక్క కుమారుడు అర్ధంతరంగా తనువు చాలించడంతో తల్లిదండ్రులు వెంకట్రావు, కుమారి శోకసంద్రంలో మునగిపోయారు. శ్రీహరి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
పెద్దారవీడు: మండలంలోని దేవరాజుగట్టు గ్రామం సమీపంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పక్కనే ఉన్న రేకుల షెడ్డులో గుర్తుతెలియని వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం వెలుగు చూసింది. తెల్లని చొక్కా, తెల్ల పంచె ధరించిన ఆ వ్యక్తి వయస్సు సుమారు 5 అడుగుల ఎత్తు, నలుపు రంగు కలిగి ఉన్నాడని పోలీసులు తెలిపారు. మృతుడి ఆచూకీ కోసం ఎస్సై సైదుబాబు దర్యాప్తు చేస్తున్నారు.
మార్కాపురం టౌన్: గత ఏడాది ఏప్రిల్ 4న మార్కాపురం పట్టణంలో జరిగిన దొంగతనం కేసులో నేరం రుజువు కావడంతో నిందితునికి 8 నెలల సాధారణ జైలుశిక్ష, రూ.1,000 జరిమానా విధిస్తూ మార్కాపురం ప్రథమ శ్రేణి కోర్టు అదనపు న్యాయమూర్తి తీర్పునిచ్చినట్లు పట్టణ ఎస్సై పి.విశ్వనాథరెడ్డి తెలిపారు. గతంలో రూ.30 వేల నగదు, రూ.18 వేల విలువైన బంగారు ఆభరణాలు చోరీ చేసిన కేసులో గుడిపాటి వీరాజీ అలియాస్ వీరాంజనేయులును పోలీసులు అరెస్ట్ చేయగా, నేరం రుజువు కావడంతో కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది.


