సంతమాగులూరు(అద్దంకి): మండలంలోని సంతగుడిపాడు నుంచి కొప్పరపాడుకు కూలీలను తరలిస్తున్న టాటా ఏస్ వాహనం అడ్డరోడ్డు టోల్‌ప్లాజా వద్ద మంగళవారం సాయంత్రం ప్రమాదవశాత్తు దగ్ధమైంది. నేషనల్ హైవే రోడ్డు పనుల కోసం కూలీలను తీసుకెళ్తున్న ఈ వాహనంలో ఒక్కసారిగా బ్యాటరీ వద్ద షార్ట్‌సర్క్యూట్ అయి మంటలు చెలరేగాయి. దీన్ని ముందుగానే గుర్తించి అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే వాహనాన్ని నిలిపి ఆరుగురు కూలీలను కిందికి దించి ప్రాణాలు కాపాడాడు. హైవే సిబ్బంది మంటలనుార్పేందుకు ప్రయత్నించినా అప్పటికే వాహనం పూర్తిగా కాలిపోయింది. సకాలంలో స్పందించి పెను ప్రమాదం తప్పుంచిన డ్రైవర్ సమయస్ఫూర్తిని స్థానికులు, కూలీలు అభినందించారు.
● అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి రామకృష్ణ
ఒంగోలు వన్‌టౌన్: జాతీయ లోక్ అదాలత్‌లో రాజీపడదగిన కేసులను పెద్ద సంఖ్యలో పరిష్కరించేందుకు న్యాయవాదులు, చిట్‌ఫండ్ సంస్థల ప్రతినిధులు సమన్వయంతో సహకరించాలని అడిషనల్ సీనియర్ సివిల్ న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్‌చార్జి కార్యదర్శి సీహెచ్‌వీ రామకృష్ణ కోరారు. మంగళవారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని బార్ అసోసియేషన్ హాల్లో న్యాయవాదులతో, అనంతరం తన చాంబర్‌లో చిట్‌ఫండ్ సంస్థల ప్రతినిధులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. సెప్టెంబర్ 12న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌లో ఇరుపక్షాల అంగీకారంతో త్వరితగతిన, అతి తక్కువ ఖర్చుతో వివాదాలను పరిష్కరించుకోవచ్చని వివరించారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రతి ఒక్కరూ చొరవ చూపాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది పంగులూరు గోవిందయ్య, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చావలి రమేష్‌బాబు, ఉపాధ్యక్షుడు రవికుమార్, న్యాయవాది సుకన్య తదితరులు పాల్గొన్నారు.


