● రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు ● ప్రమాదాలకు అవకాశం ఉన్న, తరచూ ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాల్లో 300కుపైగా సేఫ్టీ మిర్రర్లు ● 16 హైవేలపై హెచ్చరిక బోర్డులు ● ప్రతిరోజూ తెల్లవారుజామున లారీ డ్రైవర్లకు ఫేస్‌ వాష్‌ ● రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు బాధితులను ఆదుక | - | Sakshi
Sakshi News home page

● రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు ● ప్రమాదాలకు అవకాశం ఉన్న, తరచూ ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాల్లో 300కుపైగా సేఫ్టీ మిర్రర్లు ● 16 హైవేలపై హెచ్చరిక బోర్డులు ● ప్రతిరోజూ తెల్లవారుజామున లారీ డ్రైవర్లకు ఫేస్‌ వాష్‌ ● రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు బాధితులను ఆదుక

Sep 4 2026 2:24 AM | Updated on Sep 4 2026 2:24 AM

● రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు ● ప్రమాదాలకు అవకాశం ఉన్న, తరచూ ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాల్లో 300కుపైగా సేఫ్టీ మిర్రర్లు ● 16 హైవేలపై హెచ్చరిక బోర్డులు ● ప్రతిరోజూ తెల్లవారుజామున లారీ డ్రైవర్లకు ఫేస్‌ వాష్‌ ● రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు బాధితులను ఆదుకునేందుకు రోడ్‌ సేఫ్టీ టీం ఏర్పాటు ● వివిధ శాఖలతో సమన్వయం ముందుకు ● సాక్షి ప్రతినిధితో ఎస్పీ హర్షవర్థన్‌రాజు

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఉమ్మడి జిల్లాలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాలను గుర్తించాం. ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉన్న ప్రాంతాలను కూడా గుర్తించాం. బ్లాక్‌ స్పాట్లు, గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్లే మార్గంలో మెయిన్‌ రోడ్లు, లింక్‌ రోడ్లు, సర్వీస్‌ రోడ్ల నుంచి మలుపు తిరిగే ప్రదేశాలను, టి.జంక్షన్లు, వై.జంక్షన్లు, యూటర్న్‌, విజిబిలిటీ తక్కువగా ఉన్న ప్రదేశాలను గుర్తించాం. ఈ రెండు జిల్లాలను కలుపుకుని అప్రోచ్‌ రోడ్లు, ప్రధాన మూలమలుపుల వద్ద 300కుపైగా కన్వెక్స్‌ మిర్రర్లు (కుంభాకార దర్పణాలు) ఏర్పాటు చేశాం. దీంతో వాహనం దగ్గరకు వచ్చే వరకు చూసుకోకుండా ఢీకొట్టడం వంటివి తగ్గిపోయాయి. ఏదైనా మోటారు బైకు, ఆటోలను దూరం నుంచే గమనించి ముందుగానే జాగ్రత్త పడవచ్చు.

శ్రీశైలం ఘాట్‌ రోడ్డులో...

శ్రీశైలం ఘాట్‌ రోడ్డులో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎదురెదురుగా వచ్చే వాహనాలు ఢీకొనడంతో తరచూ ట్రాఫిక్‌ జామ్‌ కావడం, గంటల తరబడి వాహనాలు ఆగిపోవడం జరుగుతోంది. దీంతో శ్రీశైలం ఘాట్‌ రోడ్డులో 16 కన్వెక్స్‌ మిర్రర్లు ఏర్పాటు చేశాం. వేసవి సెలవుల్లోనే ఈ ఘాట్‌ రోడ్డులో సమస్యలు ఏర్పడుతున్నాయి. అద్దాలు ఏర్పాటు చేసిన తర్వాత ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు ఈ రోడ్డులో ప్రమాదం జరగలేదు. చిన్నచిన్న ఘటనలు మినహా పెద్ద సమస్యలు ఏర్పడటం నా దృష్టికి రాలేదు. ఇది మంచి పరిణామం.

హెచ్చరిక బోర్డులతో అప్రమత్తం...

ఉమ్మడి జిల్లాలోని హైవేలపై సూచిక బోర్డులు ఏర్పాటు చేశాం. ప్రయాణంలో వేగంగా వస్తున్న వాహనాలకు ముందుగా ఏముందో తెలియక ప్రమాదాలు అవుతుంటాయి. సూచిక బోర్డుల ద్వారా దాన్ని ముందుగానే హెచ్చరించడంతో రోడ్డు ప్రమాదాలు తగ్గించడం సాధ్యమవుతుంది. అంతేగాకుండా వేగ పరిమితి హెచ్చరికలు కూడా చేయడం వలన డ్రైవర్లు అప్రమత్తమయ్యే అవకాశం ఉంటుంది. కన్వెక్స్‌ మిర్రర్లు, హెచ్చరిక బోర్డులతో పాటుగా రిఫ్లెక్టివ్‌ స్లిప్లను కూడా ఏర్పాటు చేశాం.

డ్రైవర్లకు ఫేష్‌ వాష్‌...

జిల్లాలో అతి పెద్ద జాతీయ రహదారి ఉంది. నిత్యం ఇతర రాష్ట్రాలకు చెందిన వాహనాలు సుదూర ప్రాంతాలకు వెళ్తుంటాయి. ప్రధానంకా లారీలు ఎక్కువగా ఉంటాయి. రాత్రి పూట నిద్రపోకుండా డ్రైవింగ్‌ చేస్తుంటారు. దాంతో తెల్లవారుజామున చల్లగాలికి కునుకు పట్టినప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయి. చిన్న సమస్యతో ఆ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. దీనిని గుర్తించి ప్రతిరోజూ తెల్లవారుజామున హైవేల వద్ద లారీ డ్రైవర్లకు చల్లటి నీటితో ఫేష్‌ వాష్‌ చేయిస్తున్నాం. పోలీసు సిబ్బంది దగ్గరుండి మరీ డ్రైవర్ల మొహం, చేతులు కడుక్కునేందుకు సహాయపడుతున్నారు. తద్వారా రోడ్డు ప్రమాదాలు తగ్గించగలిగాం.

నిరంతరంగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు...

మద్యం సేవించి వాహనాలు నడపడం వలన కూడా ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అనేక నివేదికలు తెలుపుతున్నాయి. ఒక చిన్న దురలవాటు వలన కుటుంబాలను విషాదంలో ముంచివేయడం సరికాదు కదా. అందుకే నగరంలోగానీ, జిల్లా వ్యాప్తంగాగానీ ప్రతిరోజూ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించాలని పోలీసు అధికారులను ఆదేశించాను. మందు తాగి బయటకు రావాలంటే భయపడే పరిస్థితి రావాలని మందుబాబులను పట్టుకున్న వెంటనే కోర్టులో హాజరుపరుస్తున్నాం. గౌరవ కోర్డు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులను సీరియస్‌గా పరిగణిస్తోంది. ఈ కేసులో పట్టుబడిన వారికి ఒక్కొక్కరికి రూ.10 వేల జరిమానా, మరికొందరికి జైలు శిక్షలు వేయడం జరుగుతోంది. దీని ప్రభావంతో ఒకసారి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో పట్టుబడిన వారు రెండోసారి ఆ తప్పు చేయడానికి భయపడిపోతున్నారు.

రోడ్డు సేఫ్టీ టీంలతో తక్షణ సహాయం...

రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు బాధితులను ఆదుకోడానికి వివిధ శాఖలను సమన్వయం చేసి రోడ్డు సేఫ్టీ టీంలను ఏర్పాటు చేశాం. ఈ టీంలో ఉన్న శాఖలకు చెందిన బాధ్యులైన ఉద్యోగులతో ఒక వాట్సాప్‌ గ్రూప్‌ తయారు చేశాం. ఎక్కడైనా సరే రోడ్డు ప్రమాదం జరిగిందంటే వెంటనే సమాచారాన్ని ఆ గ్రూపులో పెడతాం. దాంతో ఎవరికి వారు ఘటన జరిగిన ప్రదేశానికి చేరుకుంటారు. దీని వలన బాధితులను సకాలంలో రక్షించడమే కాకుండా అవసరమైన వారికి తక్షణ వైద్య సహాయం కూడా అందించడం జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement