మట్టి ఖర్చుల బకాయిలే రూ.22 కోట్లు..! | - | Sakshi
Sakshi News home page

మట్టి ఖర్చుల బకాయిలే రూ.22 కోట్లు..!

Sep 4 2026 2:24 AM | Updated on Sep 4 2026 2:24 AM

ఉద్యోగి చనిపోతే ప్రభుత్వం నుంచి మట్టి ఖర్చులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఉద్యోగులకు మొత్తం బకాయిలు రూ.40 వేల కోట్ల నుంచి రూ.50 వేల కోట్లు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా మాపైనే అబాంఢాలు వేస్తున్నారు ఉద్యమాన్ని నీరుగార్చేందుకు వేసే ఎత్తుల్లో భాగంగానే నిందలు ఉద్యోగుల సంక్షేమమే మా ప్రధాన అజెండా ఏపీ అమరావతి జేఏసీ చైర్మన్‌ బొప్పరాజు ఒంగోలులో కలెక్టరేట్‌ వద్ద భారీ నిరసన కార్యక్రమం

ఒంగోలు సబర్బన్‌: ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే కనీసం మట్టి ఖర్చులు కూడా ఇచ్చే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదు.. ప్రభుత్వం నుంచి మట్టి ఖర్చుల బకాయిలే రూ.22 కోట్ల నుంచి రూ.23 కోట్ల వరకూ ఉన్నాయని ఏపీ అమరావతి జేఏసీ చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల న్యాయమైన కోర్కెల సాధనలో భాగంగా ఒంగోలులో కలెక్టర్‌ కార్యాలయం వద్ద గురువారం ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న బొప్పరాజు ఉద్యోగుల సమస్యలపై తన గళం విప్పారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చమంటే.. ఉద్యోగ సంఘాల మీద, ఉద్యమ నాయకుల మీద అబాంఢాలు వేస్తారా అంటూ పాలకులపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వం మీద నమ్మకంతో ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తారని రెండున్నర సంవత్సరాలు వేచి ఉన్నామన్నారు. కానీ పట్టించుకోకపోవడంతో రెండున్నర సంవత్సరాల తర్వాత న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గళం విప్పితే అబాంఢాలు, నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యమ నాయకులకు ఇవేమీ కొత్త కాదన్నారు. ఈ రెండున్నర సంవత్సరాల్లో అనని మాటలు ఇప్పుడు అంటున్నారంటే ఉద్యోగుల ఉద్యమాన్ని నీరుగార్చడమే పనిగా పెట్టుకున్నారని అర్థమవుతోందని మండిపడ్డారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు రూ.40 వేల కోట్ల నుంచి రూ.50 వేల కోట్ల వరకూ ఉన్నాయన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చమని కోరుతున్నామని, గొంతెమ్మ కోర్కెలు ఏమీ లేవని బొప్పరాజు అన్నారు. రాష్ట్రంలో వచ్చే ఆదాయం మొత్తం ఉద్యోగుల జీతాలకు సరిపోతోందనడం దుర్మార్గమైన చర్యని ఆయన అభివర్ణించారు. వచ్చే ఆదాయంలో కేవలం 37 శాతం మాత్రమే ఉద్యోగులకు ఖర్చు చేస్తున్నారని సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వ సంస్థ కాగ్‌ నివేదికలో వెల్లడించిందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం ఏర్పాటు చేసి జీఓ కూడా విడుదల చేస్తే.. ఆ జీఓకు ఇప్పటి వరకూ అతీగతీ లేదన్నారు. ముగ్గురు మంత్రులు, 10 మంది స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ స్థాయి అధికారులతో జరిగిన చర్చల్లో తీసుకున్న నిర్ణయాలు బయటపెట్టాలని నిలదీశారు. ఉద్యమం ఉధృతం కాకముందే డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. ఒక్క రూపాయి ఖర్చులేని పీఆర్‌సీ కమిషనర్‌ను ఇప్పటి వరకూ ఎందుకు నియమించలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఐదు డీఏల బకాయి ఉందని, ఐఆర్‌ ఊసే లేదని అన్నారు. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఐఆర్‌ఎస్‌లు కేంద్రం నుంచి 5 డీఏలు తీసుకున్నారని గుర్తుచేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నామినేటెడ్‌ పోస్టుల చైర్మన్లకు రావాల్సిన అన్ని ఆర్థికపరమైన అంశాలు తీర్చుకుంటున్నారన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి సేవ చేసే ఉద్యోగులకు మాత్రం బకాయిల మీద బకాయిలు పెట్టుకుంటూ పోతున్నారని ధ్వజమెత్తారు. తాము ఉద్యోగుల సంక్షేమం కోసమే పనిచేస్తున్నామని కుండబద్దలు కొట్టిమరీ చెప్పారు.

15 నుంచి వర్క్‌ టూ రూల్‌...

తమ డిమాండ్ల సాధన కోసం సెప్టెంబర్‌ 3 నుంచి 5వ తేదీ వరకూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్నట్లు బొప్పరాజు తెలిపారు. 15వ తేదీ నుంచి వర్క్‌ టూ రూల్‌ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు చెప్పారు. తమ సమస్యలు పరిష్కారమయ్యేంత వరకూ ప్రజాస్వామ్య పద్ధతిలో దశల వారీగా ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ప్రకటించిన కార్యాచరణ ప్రకారం తదుపరి దశల్లో మరింత ఉధృతంగా ఉద్యమం చేపడతామన్నారు. నల్ల బ్యాడ్జీలు ధరించి మధ్యాహ్న భోజన విరామ సమయంలో కలెక్టరేట్‌ లోపల ప్రధాన గేటు వద్ద ఆందోళనకు దిగి నిరసన వ్యక్తం చేసిన ఉద్యోగులు.. సీఎం సార్‌ మా డబ్బులు మాకు చెల్లించండి అంటూ నినాదాలు చేయడంతో కలెక్టరేట్‌ మార్మోగింది. కార్యక్రమంలో ఏపీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు జి.ఆంజనేయులు, కార్యదర్శి పోలయ్య, బాలసుబ్రహ్మణ్యకుమార్‌, రాష్ట్ర నాయకులు శివకుమారిరెడ్డి, ప్రకాశం జిల్లా ఉమెన్‌ వింగ్‌ చైర్‌పర్సన్‌ ఎస్‌.జయలక్ష్మి, కార్యదర్శి ఎస్‌.శ్రీదేవి, కలెక్టరేట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బి.సత్య శ్రీనివాస్‌, ఏపీ జేఏసీ అమరావతి వైస్‌ ప్రెసిడెంట్‌ ఊతకోలు శ్రీనివాసరావు, నాలుగో తరగతి ఉద్యోగుల అధ్యక్షుడు కే వెంకటేశ్వర్లు, జిల్లా డ్రైవర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ప్రసన్న కుమార్‌, ప్రశాంత్‌ నాయుడు, రాము, రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement