మూడున్నర దశాబ్దాలుగా...
బల్లికురవ: ‘నేను పనిచేస్తున్న గ్రామంలోనే నివాసం ఉంటాను.. ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గ్రామంలోనే నివాసం ఉంటే ఆ పాఠశాలలోని విద్యార్థుల సాదక బాధలు తెలుస్తాయి. నేను ఎక్కడ పనిచేసినా అలాగే చేస్తాను’ అని బెస్ట్ టీచర్ అవార్డుకు ఎంపికై న పి.శ్రీనివాసరావు అన్నారు. శ్రీనివాసరావు స్వగ్రామం ఇంకొల్లు. ఈయన 1989లో ఎస్‌జీటీగా పామూరు మండలం చిలంకూరులో ఉద్యోగంలో చేరారు. 2000లో స్కూల్ అసిస్టెంట్ (మ్యాథ్స్)గా తర్లుపాడులో పదోన్నతి పొందారు. అక్కడి నుంచి జే పంగులూరు మండలం బూదవాడ, కోటపాడు, ఇంకొల్లు మండలం దుద్దుకూరులో పనిచేశారు. 2021లో బల్లికురవ మండలం కొప్పెరపాడుకు ప్రధానోపాధ్యాయునిగా పదోన్నతిపై వచ్చారు. 37 ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో సేవలందించారు.
విద్యార్థుల అభ్యున్నతే లక్ష్యంగా...
మార్కాపురం టౌన్: రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎన్నికై న కే వేణుగోపాల్ మ్యాథ్స్ టీచర్‌గా పనిచేస్తూనే సైన్స్, తెలుగు సబ్జెక్టుల్లో కూడా విద్యార్థులపై దృష్టి సారించారు. ఆయన పనిచేసిన నాగులవరం, అర్థవీడు మండలంలోని అచ్చంపేట, మార్కాపురం జెడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు కౌసెల్, ఇన్‌స్పైర్, సైన్సు ఫెయిర్‌లో శిక్షణ ఇచ్చి ప్రదర్శనలో పాల్గొనేలా చేశారు. 10 రాష్ట్ర స్థాయి బహుమతులు సాధించారు. వేణుగోపాల్ విద్యార్థులతో ఏర్పాటు చేసిన ట్రీ రీప్లాంటేషన్ ప్రదర్శన 2017లో జాతీయ స్థాయిలో ఎంపికై ంది. కథలు, కవితలు రాస్తున్న వేణుగోపాల్ విద్యార్థుల్లో మోటివేషన్ కోసం పుస్తకాలు కూడా రాశారు. నాగులవరం పాఠశాలలో పనిచేస్తూ దాతల సహకారంతో 6 లక్షల రూపాయలతో పాఠశాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అధికారులు, ప్రజల మన్ననలు పొందారు.
సొంత డబ్బుతో సేవ...
కంభం: మండలంలోని హజరత్‌గూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఆకవీటి సరోజ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. ఈమె 1996 నవంబర్ నెలలో తురిమెళ్ల ప్త్రెమరీ పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తిని ప్రారంభించారు. సాక్షి ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 2010లో పదోన్నతి పొంది ఎల్.కోట ఉన్నత పాఠశాలలో పనిచేశారు. ఎల్.కోట పాఠశాలలో లక్ష రూపాయలతో తెలుగు సాహితీ నిలయం ఏర్పాటు చేశారు. హజరత్‌గూడెంలో వంటగది, భోజనశాల, గ్రంథాలయం ఏర్పాటు, పాఠశాల, గ్రామంలో మొక్కలు పెంచడం వంటి కార్యక్రమాలను సొంత నిధులతో చేపట్టారు.


