● రెండో రోజుకు చేరుకున్న రిలే నిరాహార దీక్షలు
ఒంగోలు సబర్బన్: పంచాయతీ కార్మికులు, గ్రీన్ అంబాసిడర్ల జీతాలు పెంచే వరకు ఐక్యంగా పోరాడాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జీవీ కొండారెడ్డి పిలుపునిచ్చారు. పంచాయతీ కార్మికులు, గ్రీన్ అంబాసిడర్లు సమస్యల పరిష్కారం కోరుతూ కలెక్టరేట్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరాయి. 36 గంటల పాటు నిర్వహించనున్న ఆందోళనకు ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్‌న్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి. శ్రీనివాసులు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో కొండారెడ్డి మాట్లాడుతూ గ్రీన్‌్ అంబాసిడర్లకు రూ.6 వేలు, పంచాయతీ కార్మికులకు రూ.9 వేల నుంచి రూ.11 వేల వరకు మాత్రమే వేతనాలు చెల్లిస్తూ ప్రభుత్వం శ్రమ దోపిడీకి పాల్పడుతోందని విమర్శించారు. నెలకు రూ.6 వేలతో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఒక్క రోజు జీవించగలరా అని ప్రశ్నించారు. పంచాయతీ పారిశుధ్య కార్మికుల్లో 90 శాతం మంది నిరుపేద దళితులు పనిచేస్తున్నారని, నెలల తరబడి జీతాలు చెల్లించకుండా వారి కుటుంబాలను ఆకలి కేకల్లోకి నెట్టడమేనా దళితుల ఉద్ధరణ అని ప్రశ్నించారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం రమేష్ మాట్లాడుతూ పంచాయతీ కార్మికులు, గ్రీన్ అంబాసిడర్లకు ఉన్న వేతన బకాయిలను యుద్ధ ప్రాతిపదికన చెల్లించి కుటుంబాలను ఆకలి బాధల నుంచి కాపాడాలని డిమాండ్ చేశారు. కురిచేడు, బి.నిడమానూరులో 13 నెలలు, కల్లూరులో 24 నెలలుగా వేతనాలు చెల్లించకపోతే కార్మికులు ఎలా బతకాలని ప్రశ్నించారు. అనంతరం జేసీ కల్పనా కుమారికి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. జిల్లా పంచాయతీ అధికారితో మాట్లాడి తమ పరిధిలోని సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి పి. కల్పన, జిల్లా ఉపాధ్యక్షులు టి. రాము, జిల్లా నాయకులు జీవీబీ కుమార్, జి. బసవపున్నయ్య, ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్‌న్ జిల్లా ట్రెజరర్ ఏలిషా, ఎ. ఇశ్రాయేలు, తిరిపాల్, సునీత, లక్ష్మయ్య, కె.శివాజీ, బాలకోటయ్య, ఎం. దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.
టీడీపీ, జనసేన నేతల మధ్య కొట్లాట
● పవన్‌కల్యాణ్ పుట్టిన రోజును పురస్కరించుకొని పాటకచేరీ
● పాటకచేరీ సందర్భంగా రెండు వర్గాల మధ్య కొట్లాట
● అడ్డు వచ్చిన పోలీసులపై దౌర్జన్యం
సాక్షి టాస్క్‌ఫోర్స్: దర్శి నియోజకవర్గంలో టీడీపీ–జనసేన పార్టీల మధ్య రాజకీయ విభేదాలు మళ్లీ భగ్గుమన్నాయి. పవన్‌కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా రెండు పార్టీల నేతలు గొడవకు దిగారు. అయితే బుధవారం ఉదయం ఇరు పార్టీ నేతలు గొడవ పడి కొంత సేపటి తరువాత సర్దుమణిగారు. ఆ తరువాత బుధవారం రాత్రి గడియారం స్తంభం సెంటర్‌లో జనసేన నాయకుడు వరికూటి నాగరాజు జనసేన పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన పవన్‌కళ్యాణ్ పుట్టిన రోజు కేక్ కట్ చేసి నినాదాలు చేశారు. ఆ తరువాత కురిచేడు రోడ్డులో ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో పాటకచేరీ ఏర్పాటు చేశారు. రాత్రి 11:30 గంటల సమయంలో టీడీపీ జనసేన నేతలు గొడవకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ సమయంలో రెండు పార్టీల నేతల మధ్య మాటా మాటా పెరిగి కొట్లాడుకునే స్థాయికి వచ్చింది. పరిస్థితి విషమించడంతో ఎస్సై మత్తులో ఉన్న రెండు వర్గాలను చెదరగొట్టారు. దీంతో వారు రాళ్లు తీసుకొని పోలీసులపై దాడికి దిగారు. పోలీస్ జీపుపై కూడా రాళ్లు వేసి వాహనం అద్దం పగులగొట్టారు. అయితే ఈ గొడవల్లో ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన కొందరు ముఖ్య కారకులను వదిలేసి బీసీ సామాజిక వర్గానికి చెందిన వారిని కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చర్చించుకుంటున్నారు. ఈ విషయంలో అధికార పార్టీ పెద్దల నుంచి కేసులు లేకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.అయితే పోలీస్ జీప్ పగులగొట్టి గొడవలకు దిగిన వారిపై పోలీసులు కేసు పెడతారో లేదో వేచి చూడాల్సిందే.
ఒంగోలు వన్‌టౌన్: వాహనాన్ని నిర్లక్ష్యంగా నడిపి మహిళ మృతికి కారణమైన డ్రైవర్‌కు ఏడాది జైలుశిక్ష, రూ.3 వేల జరిమానా విధిస్తూ ఒంగోలు మూడో మున్సిఫ్ మేజిస్ట్రేట్ వి.నవ్యశ్రీ గురువారం తీర్పు చెప్పారు. వివరాల్లోకి వెళితే.. 2022 ఏప్రిల్ 20న ఒంగోలు నుంచి గుంటూరు వైపు వెళుతున్న కారును నడుపుతున్న కడపకు చెందిన ఎస్ గంగాధర్ అనే వ్యక్తి ఒంగోలు సమీపంలోని త్రోవగుంట వద్ద రోడ్డుపై వెళుతున్న జి శేషమ్మ అనే మహిళను ఢీకొట్డాడు. ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిందితున్ని కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో నేరం రుజువు కావడంతో నిందితునికి శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు.


