● తాగునీటి చెరువులో దూకి బీటెక్ విద్యార్థి అభిలాష్ ఆత్మహత్య
● మృతుడి స్వగ్రామం చీమకుర్తి మండలం పల్లామల్లి
చిలకలూరిపేట టౌన్/చీమకుర్తి రూరల్: కళాశాలలో ఫీజు కట్టి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థి విగతజీవిగా తేలాడు. తాగునీటి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన చిలకలూరిపేటలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. చీమకుర్తి మండలం పల్లామల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, నాగరాజ దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో చిన్న కుమారుడు గనిపినేని అభిలాష్ (21) గుంటూరులోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ (సీఎస్‌ఈ) మూడో సంవత్సరం చదువుతున్నాడు. గత ఏప్రిల్ వరకు చిలకలూరిపేటలోని టిడ్కో గృహాల్లో స్నేహితులతో కలిసి అద్దెకు ఉన్న అభిలాష్, ఆ తర్వాత స్వగ్రామానికి వెళ్లిపోయాడు. నాలుగు రోజుల క్రితం గ్రామంలో బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యంలో కుటుంబంతో కలిసి పాల్గొన్నాడు. ఈ క్రమంలో కళాశాలలో సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లించి వస్తానని ఈ నెల 1వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ఇంటి నుంచి బయలుదేరాడు.
చెరువు గట్టుపై బ్యాగు, చెప్పులు..
చిలకలూరిపేట పట్టణ పరిధిలోని టిడ్కో గృహాల సమీపంలో తాగునీరు సరఫరా చేసే కొత్త చెరువు వద్దకు చేరుకున్న అభిలాష్.. గట్టుపై తన దుస్తులు, బ్యాగు, ఐడీ కార్డు, చెప్పులు విడిచిపెట్టి నీటిలోకి దూకాడు. బుధవారం సాగర్ జలాలతో చెరువును నింపే పనుల్లో ఉన్న సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం అందించారు. రూరల్ ఎస్సై జి.అనిల్‌కుమార్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని, గజ ఈతగాళ్ల సాయంతో చెరువుతో పాటు ఫిల్టర్ బావిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఐడీ కార్డు ఆధారంగా సమాచారాన్ని కుటుంబ సభ్యులకు చేరవేశారు. గురువారం ఉదయం నీటిపై తేలిన అభిలాష్ మృతదేహాన్ని బయటకు తీసి, పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. మొదటి నుంచీ చదువుపై పెద్దగా ఆసక్తి లేకపోవడం వల్లే తీవ్ర మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడి ఉంటాడని కుటుంబ సభ్యులు తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సంతమాగులూరు(అద్దంకి): ప్రమాదవశాత్తు చెరువులో పడి బాలిక మృతి చెందింది. ఈ సంఘటన సంతమాగులూరు పోలీస్‌స్టేషన్ సమీపంలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని పొలాల్లో సుబాబుల్ కర్రకొట్టేందుకు చీమకుర్తి మండలం బుక్కిరెడ్డిపాలెంకు చెందిన పది మంది కూలీల కుటుంబాలు పోలీస్‌స్టేషన్‌కు సమీపంలో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నాయి. వీరిలో నాగరాజు కుమార్తె మేకల మంజుల(5) తల్లిదండ్రులు హైదరాబాద్‌లో కూలీ పనులు చేసుకంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు ఇద్దరూ నాలుగు రోజుల క్రితం బాలిక అమ్మమ్మ రామాంజనమ్మ ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో మంజుల గురువారం సాయంత్రం బహిర్భూమికి గుడిసెలకు సమీపంలోని చెరువు వద్దకు వెళ్లింది. అక్కడ కాలు జరడంతో చెరువులో పడి మృతిచెందింది. ఏఎస్సై శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.
● ఏపీఎన్‌జీఓ అసోసియేషన్ అధ్యక్షుడు కూచిపూడి శరత్ బాబు
ఒంగోలు సబర్బన్: ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే చర్చలకు ఆహ్వానించాలని ఏపీ ఎన్‌జీఓ అసోసియషన్ జిల్లా అధ్యక్షుడు కె.శరత్‌బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక ఎన్‌జీఓ హోంలో గురువారం ఉమ్మడి ప్రకాశం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశంలో శరత్‌బాబు మాట్లాడుతూ ప్రభుత్వం చర్చలను ప్రారంభించి ఉద్యోగుల న్యాయమైన, అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. చర్చలు మాత్రమే ఉద్యోగుల సమస్యలకు పరిష్కారమన్నారు. ప్రభుత్వం ముందుకు రాకుంటే రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం వెంటనే పీఆర్‌సీ కమిషన్ వేయాలని, పెండింగ్‌లో ఉన్న 5 డీఏలను రిలీజ్ చేయాలని, డీఏ అరియర్స్‌ను వెంటనే ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కార్యదర్శి ఆర్‌సీహెచ్ కృష్ణా రెడ్డి, జిల్లా కోశాధికారి కె.శివకుమార్, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి బి.కృష్ణ కిషోర్, జిల్లా ఉపాధ్యక్షులుడు ట శ్రీనివాసు, పి.రామాంజనేయులు, బి.విజయ్ కుమార్, ఆర్ దీపక్ కుమార్, కె.కోటేశ్వరమ్మ సంయుక్త కార్యదర్శులు, మండలాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.


