● ఏఎస్పీ (అడ్మిన్) యుగంధర్ బాబు
ఒంగోలు టౌన్: సర్వీసులో లేకపోయినా పోలీసు కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని, అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ మరణించిన పోలీసు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరినీ ఎప్పటికీ పోలీసు కుటుంబ సభ్యులుగానే భావిస్తామని అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) ఎన్.యుగంధర్ బాబు అన్నారు. ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో విధులు నిర్వర్తిస్తూ వివిధ కారణాలతో మరణించిన పోలీసు సిబ్బంది కుటుంబాలు, రిటైర్డ్ పోలీసు సిబ్బంది, హోంగార్డులతో గురువారం పోలీసు కళ్యాణమండపంలో సమావేశం నిర్వహించారు. వారికి అందాల్సిన సంక్షేమ, రిటైర్డ్‌మెంట్ ప్రయోజనాల గురించి అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలకు సంబంధించిన వివరాలను సేకరించారు. పెండింగ్ ఫైళ్లను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని డీపీఓ సిబ్బందికి ఆదేశించారు. సందర్భంగా ఏఎస్పీ యుగంధర్‌బాబు మాట్లాడుతూ కారుణ్య నియామకాలు పొందని కుటుంబ సభ్యులకు త్వరితగతిన నియామకాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన ప్రయోజనాలు సకాలంలో అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసు కుటుంబ సభ్యుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఆర్‌ఐ సీతారామిరెడ్డి, ఏఏఓ విజయ కుమార్, డీపీఓ సూపరింటెండెంట్ యాస్మిన్ బాను, వినుత తదితరులు పాల్గొన్నారు.
● వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా వేసిన పూలదండలు తొలగింపు
● వర్ధంతి కార్యక్రమం నిర్వహించిన వైఎస్సార్ అభిమానులకు బెదిరింపు
● భయాందోళన చెందుతున్న వైఎస్సార్ సీపీ శ్రేణులు
మర్రిపూడి: గ్రామాల్లో టీడీపీ నేతల ఆకృత్యాలకు అడ్డే లేకుండా పోయింది. అధికారం అండగా బెదిరింపులకు దిగుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..మండలంలోని రామాయపాలెంలో బుధవారం వైఎస్సార్ వర్ధంతిని పురస్కరించుకొని వైఎస్సార్ విగ్రహానికి వైఎస్సార్ సీపీ అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామనికి చెందిన యర్రమోతు వెంకటేశ్వర్లు, పోకూరి కొండయ్య, మార్నేని రామకృష్ణ, జొన్నలగడ్డ సురేష్, వై సురేష్ తదితరులు వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు యర్రమోతు శ్రీను, పోకూరి వెంకటేశ్వర్లు, మలసాని నాగేశ్వరరావు, మలసాని సుబ్బయ్య కుమారుడు నాగేశ్వరరావులు వైఎస్సార్ విగ్రహం వద్దకు చేరుకొని విగ్రహానికి ఉన్న పూలదండలు తీసివేశారు. వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించిన వారిని ఫోన్ చేసి బెదిరించారు. దీంతో వైఎస్సార్ సీపీ సానుభూతి పరులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మీకు ఎంత ధైర్యం ఉంటే వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తారు అంటూ పరుష పదజాలంతో దూషించారు. గ్రామంలోకి వస్తే మీ సంగతి తేలుస్తామంటూ భయభ్రాంతులకు గురిచేస్తారు.
మార్కాపురం టౌన్: ప్రకాశం, మార్కాపురం, కర్నూలు, నంద్యాల, బాపట్ల, గుంటూరు, పల్నాడు, కడప, నెల్లూరు జిల్లాల మాజీ సైనికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా సైనికుల సంక్షేమ అధికారి గురువారం తెలిపారు. సెక్యూరిటీ విభాగంలో మొత్తం 287 ఖాళీలు ఉన్నాయని, ఆసక్తి గల అర్హులు ఈ నెల 10న ఉదయం 6.30 గంటలకు మార్కాపురం జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగే ఇంటర్వ్యూలకు అసలు ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు.


