● కదిలిన అధికార యంత్రాంగం..
● గంటవానిపల్లె వద్ద కాంక్రీట్ పనులు ప్రారంభం
పెద్దదోర్నాల: వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ లీకేజీ వ్యవహారంపై ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి ఇరిగేషన్ యంత్రాంగం స్పందించింది. పెద్దదోర్నాల మండల పరిధిలోని గంటవానిపల్లె సమీపంలో ఫీడర్ కెనాల్‌కు ఏర్పడిన లీకేజీలను పూడ్చేందుకు గురువారం హుటాహుటిన మరమ్మతు పనులు ప్రారంభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్భాటంగా ప్రాజెక్టు ప్రారంభించిన 48 గంటల్లోనే వెలిగొండ ప్రాజెక్టు కార్యాలయానికి కిలోమీటరు దూరంలో కెనాల్‌కు లీకేజీ ఏర్పడటం తీవ్ర కలకలం రేపింది. పనుల్లో నాణ్యత లోపించిందని స్థానికులు విమర్శించినా, అధికారులు మాత్రం ఇది కేవలం ‘నేల చెమ్మగిల్లడమే’నంటూ బుకాయించే యత్నం చేశారు. ఈ నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేస్తూ ‘సాక్షి’లో కథనం వెలువడటంతో ఇరిగేషన్ ఉన్నతాధికారులు స్పందించారు. లీకేజీ ఏర్పడిన ప్రాంతంలో కట్ట వెంబడి ప్రత్యేకంగా కాలువ తీసి, అందులో కాంక్రీట్ నింపి నీరు బయటకు రాకుండా పనులు చేపట్టారు. ప్రస్తుతం కెనాల్‌లో నీటి ప్రవాహం కొనసాగుతున్నందున తాత్కాలికంగా లీకేజీని అరికట్టామని, నీటి విడుదల తగ్గిన తర్వాత పూర్తిస్థాయి మరమ్మతులు చేపడతామని అధికారులు చెప్పారు.


