ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు
ఊరూరా అన్నదానాలు, సేవా కార్యక్రమాలు
è దర్శి నియోజకవర్గ వ్యాప్తంగా దివంగత సీఎం వైఎస్సార్ వర్ధంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. దర్శి పట్టణంలోని గడియార స్తంభం సెంటర్, వైఎస్సార్ కూడళ్లలో స్థానిక ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ రాజన్న విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పుట్టబజారు, ప్రధాన కూడళ్లలో పేదలకు అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు. అన్ని మండలాల్లో పారీ్‌ట్ నాయకులు, అభిమానులు మహానేత విగ్రహాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
è కొండపి నియోజకవర్గం కొండపి, సింగరాయకొండ, జరుగుమల్లి, పొన్నలూరులో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాల్లో మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు ఆదిమూలపు సురేష్ పాల్గొని వైఎస్సార్ విగ్రహాలకు నివాళులర్పించారు. ఎన్నో సంక్షేమ పథకాలతో వైఎస్సార్ ప్రజల హృదయా ల్లో చిరస్మణీయుడిగా ఉన్నారని కొనియాడారు. కె.ఉప్పలపాడులో పార్టీ జిల్లా అధ్యక్షుడు డాకా పిచ్చిరెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం చేశారు.
è సంతనూతలపాడు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించారు. చీమకుర్తిలో నిర్వహించిన కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున పాల్గొని వైఎస్సార్ సేవలను కొనియాడారు. తొలుత బూచేపల్లి కల్యాణ మండపం ప్రాంగణంలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి వారు నివాళులర్పించారు. చీమకుర్తి, సంతనూతలపాడు, మద్దిపాడు, నాగులుప్పలపాడులోని వైఎస్సార్ విగ్రహాలకు మేరుగు నాగార్జున నివాళులర్పించారు. గుండ్లకమ్మ నది నుంచి మహిళలు బిందెలతో నీరు తీసుకురాగా, వాటితో వైఎస్సార్ విగ్రహాలకు జలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
è కందుకూరులో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతిని పురస్కరించుకొని నివాళి అర్పించారు. స్థానిక రెవెన్యూ కార్యాలయం ఎదురు ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పార్టీ నేతలతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజశేఖర్‌రెడ్డి పాలన ఓ స్వర్ణయుగం వంటిదని కొనియాడారు. కందుకూరులో పలు ప్రాంతాల్లో బుర్రా ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు.
è మహానేత రాజశేఖరరెడ్డి వర్ధంతిని మార్కాపురం నియోజకవర్గంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ సీపీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి రాజన్న సేవలను స్మరించుకున్నారు. మార్కాపురం పట్టణంలోని పాత బస్టాండ్, తూర్పు వీధి సెంటర్లలో ఉన్న వైఎస్సార్ విగ్రహాలకు నియోజకవర్గ ఇన్‌చార్జి అన్నా రాంబాబు, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తర్లుపాడు, పొదిలి, మార్కాపురం, కొనకనమిట్ల మండలాల్లోని పలు గ్రామాల్లో స్థానిక నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ విగ్రహాలకు నివాళులర్పించారు.
è యర్రగొండపాలెం నియోజకవర్గంలో వైఎస్సార్ వర్ధంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ కేంద్రమైన యర్రగొండపాలెంలో వైఎస్సార్ సీపీ శ్రేణులు పార్టీ కార్యాలయం నుంచి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి, వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. పెద్దదోర్నాల మండల కేంద్రంలోని నటరాజ్ సెంటర్‌లో ఉన్న వైఎస్సార్ కాంస్య విగ్రహాన్ని వెలిగొండ ప్రాజెక్టు కృష్ణా జలాలతో అభిషేకించి అభిమానులు, పార్టీ శ్రేణులు వినూత్న రీతిలో కృతజ్ఞతలు తెలిపారు. పెద్దారవీడు, త్రిపురాంతకం మండలాల్లోనూ వైఎస్సార్ విగ్రహాలకు నివాళులర్పించి, సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
è దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ఎప్పటికీ చిరస్మరణీయులని, ఆయన జ్ఞాపకాలు ప్రజల మనసుల్లో పదిలంగా ఉంటాయని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతిని గిద్దలూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో బుధవారం నియోజకవర్గ ఇన్‌చార్జ్ కేపీ నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. బేస్తవారిపేట జంక్షన్‌లో, కంభం పంచాయతీ కందులాపురం కూడలిలో, అర్థవీడు మండలం నాగులవరంలో, గిద్దలూరు పట్టణంలోని రాచర్ల గేటు సమీపంలోని వైఎస్సార్ విగ్రహాలకు కేపీ నాగార్జునరెడ్డి క్షీరాభిషేకం చేసి పూలమాలలు వేశారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్, యర్రగొండపాలెం పరిశీలకుడు పిడతల ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో కూడా గిద్దలూరులో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
è వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఒంగోలు నగరంలోని పలు డివిజన్లు, నియోజకవర్గ పరిధిలోని ఒంగోలు రూరల్ మండలం, కొత్తపట్నం మండలాల్లోని గ్రామాల్లో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రాజన్న విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఒంగోలు చర్చి సెంటర్‌లో మహానేత వైఎస్సార్, జాన్ వెస్లీ విగ్రహాలకు చుండూరి రవిబాబు, బత్తుల బ్రహ్మానందరెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
è దివంగత నేత, మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమాలు కనిగిరి నియోజకవర్గంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. వాడవాడలా ఉన్న ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జ్ దద్దాల నారాయణ యాదవ్ పలు చోట్ల వైఎస్సార్ విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు. పార్టీ నేతల ఆధ్వర్యంలో భారీగా అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు.
è వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలను అద్దంకి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ సీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ చింతలపూడి అశోక్‌కుమార్ పలు మండలాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొని వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అద్దంకిలోని వైఎస్సార్ విగ్రహానికి జలాభిషేకం చేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు అన్నదానం చేశారు. సంతమాగులూరు మండలంలోని బండివారిపాలెంలో, మేదరమెట్లలో, జె.పంగులూరు మండలంలోని ముప్పవరం దళిత కాలనీలో, బల్లికురవ మండలంలోని కొప్పెరపాడులో అశోక్‌కుమార్ పాల్గొని వైఎస్సార్ విగ్రహాలకు నివాళులర్పించారు.
కాలం కదిలినా..
నాగులుప్పలపాడులో గుండ్లకమ్మ ప్రాజెక్టు నీటితో వైఎస్సార్ విగ్రహానికి
జలాభిషేకం చేస్తున్న మాజీ మంత్రి మేరుగు నాగార్జున
కొండపిలో వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్
దర్శి వైఎస్సార్ సెంటర్‌లో అన్నదానం ప్రారంభిస్తున్న బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, పక్కన వెంకాయమ్మ
అద్దంకిలో పేదలకు నిత్యావసర సరుకులు అందజేస్తున్న
చింతలపూడి అశోక్ కుమార్
కనిగిరిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేస్తున్న నియోజకవర్గ ఇన్‌చార్జ్
దద్దాల నారాయణ యాదవ్
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ శ్రేణులు, అభిమానులు ‘రాజన్న’ను స్మరించుకున్నారు. పల్లె నుంచి పట్టణం వరకు వైఎస్సార్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన హయాంలో అమలైన సంక్షేమ పథకాలు, ప్రజలకు అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. వివిధ ప్రాంతాల్లో అన్నదానాలు నిర్వహించారు. పేదలకు సేవా కార్యక్రమాలు చేపట్టారు. వైఎస్సార్ ఆశయాలను కొనసాగించడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని నాయకులు పేర్కొన్నారు.
ఆయన లేరు.. కానీ ఆయన జ్ఞాపకం ఉంది. కాలం కదిలిపోతుంది. రోజులు దొర్లిపోతున్నాయి. తరాలు మారిపోతున్నాయి.
కానీ ఆయన కొన్ని జ్ఞాపకాలు మాత్రం ప్రతి గుండె గర్భంలో పదిలంగా ఉన్నాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి ఓ చెరగని జ్ఞాపకం.
ఆయన భౌతికంగా దూరమై పదిహేడేళ్లు గడిచినా.. ప్రజల గుండెల్లో ఆయనపై ఉన్న అభిమానం ఇసుమంతైనా తగ్గలేదు.
పేదల కన్నీటిలో ఓదార్పుగా.. ఆపన్నుల ఆశలో భరోసాగా.. ప్రతి గుండె చప్పుడులో ఓ సజీవ స్ఫూర్తిగా నేటికీ నిలిచారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఊరూరా ఆయనను స్మరించుకున్నారు. విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి కన్నీటి నివాళులర్పించారు. పేదలకు వస్త్రదానాలు, అన్నదానాలు నిర్వహించి వైఎస్సార్‌తో తమకున్న ఆత్మీయ అనుబంధాన్ని చాటుకున్నారు.


