పలు ప్రాజెక్టులకు వైఎస్సార్ ఆద్యుడు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి జలయజ్ఞ ప్రదాతకు ఘన నివాళి
ఒంగోలు సిటీ: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల సాధనకు కృషి చేస్తామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అన్నారు. 17వ వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా బుధవారం ఒంగోలులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ మంత్రి మేరుగు నాగార్జున, ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరి రవిబాబు, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి వైఎస్సార్ విగ్రహానికి జలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయం, రైతులు, సాగునీటి ప్రాజెక్టులకు వైఎస్సార్ అత్యంత ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. జిల్లాలో గుండ్లకమ్మ, రామతీర్థం, వెలిగొండ వంటి ప్రాజెక్టుల అభివృద్ధికి వైఎస్సార్ హయాంలోనే బలమైన పునాది పడిందన్నారు. ఆరోగ్యశ్రీ, 108, 104, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలతో పేద ప్రజలకు అండగా నిలిచిన మహానుభావుడు వైఎస్సార్ అని కొనియాడారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ ప్రతి ఇంట్లో దేవుడి పటం పక్కన వైఎస్సార్ ఫొటో పెట్టుకున్నారంటే ఆయన చేసిన మంచి పనులేనన్నారు. ఆయన ఆశయసాధన కోసం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో పనిచేసి ప్రజలకు సేవ చేస్తామన్నారు.
వైఎస్సార్ బాటలోనే జగన్ పాలన..
వైఎస్సార్ ప్రజల కోసం పాదయాత్ర చేసి తెలుసుకున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేశారని జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతులు, మహిళలు, పేదల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేశారని తెలిపారు. వైఎస్సార్ ఆశయాలను కొనసాగిస్తూ ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన పాలనలో ఆరోగ్యశ్రీ, 108, 104, అమ్మఒడి, విద్యాదీవెన, వసతిదీవెన, రైతుభరోసా వంటి పథకాలను అమలు చేశారని పేర్కొన్నారు.
సంక్షేమం..అభివృద్ధికి పెద్దపీట:
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనలో సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేశారని సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జ్ మేరుగు నాగార్జున తెలిపారు. కరువుతో అల్లాడుతున్న ప్రజలకు సాగునీరు అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాజెక్టులను చేపట్టిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుందన్నారు. ప్రాజెక్టుల కోసం భారీగా నిధులు కేటాయించి అనేక పనులను ముందుకు తీసుకెళ్లారని పేర్కొన్నారు. విద్య, మహిళా సంక్షేమం, రైతులు, పేదల కోసం అనేక కార్యక్రమాలు అమలు చేసిన మహానేతగా వైఎస్సార్ చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ఆయన ఆశయాలను ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరింత ముందుకు తీసుకెళ్లారని పేర్కొన్నారు.
జలయజ్ఞానికి ఆద్యుడు వైఎస్సార్..
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జలయజ్ఞానికి ఆద్యుడని ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరి రవిబాబు అన్నారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో అనేక సాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారని తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో ప్రారంభమైన పలు ప్రాజెక్టులను వైఎస్సార్ ముందుకు తీసుకెళ్లి అనుమతులు సాధించి పనులు వేగవంతం చేశారని పేర్కొన్నారు. తెలుగు నేల ఉన్నంతకాలం జలయజ్ఞ ప్రదాతగా వైఎస్సార్ పేరు నిలిచిపో తుందన్నారు. ఆయన వారసుడు వైఎస్ జగన్ నాయకత్వంలో పనిచేయడం తమ అదృష్టమని తెలిపారు.
వెలిగొండకు వైఎస్సార్ కృషి మరువలేనిది..
జలయజ్ఞ ప్రదాతగా వైఎస్సార్ రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారని ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లాలో వందేళ్ల నాటి కలగా ఉన్న వెలిగొండ ప్రాజెక్టును కార్యరూపంలోకి తీసుకురావడంలో వైఎస్సార్ కృషి కీలకమన్నారు. ఆయన హయాంలోనే ప్రాజెక్టు పనులు గణనీయంగా ముందుకు సాగాయని, అనంతరం జగన్ ప్రభుత్వం ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. వైఎస్సార్ హయాంలో చేపట్టిన అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తప్పుడు ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, దర్శి అసెంబ్లీ పరిశీలకుడు మాదాసి వెంకయ్య, ఒంగోలు అసెంబ్లీ పరిశీలకుడు వై.వెంకటేశ్వరరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.వి.రమణారెడ్డి, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి భూమిరెడ్డి రమణమ్మ, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నం శ్రీధర్, చీమకుర్తి జెడ్పీటీసీ శ్రీనివాసరావు, చీమకుర్తి ఎంపీపీ యద్దనపూడి శ్రీనివాసరావు, పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ దామరాజు క్రాంతికుమార్, వైఎస్సార్ సీపీ నాయకులు పాలడుగు రాజీవ్, దేవా, సన్నీ పాల్గొన్నారు.


