ఒంగోలు సిటీ: జవహర్ నవోదయ విద్యాలయంలో 9, 11వ తరగతిల్లో చేరేందుకు వచ్చే విద్యా సంవత్సరానికి 2027–2028 మిగిలిన సీట్ల భర్తీ కోసం దరఖాస్తు చేసుకోవాలని నవోదయ విద్యా లయ ప్రిన్సిపాల్ సి.శివరాం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రకాశం జిల్లా పరిధిలో అన్ని ప్రభుత్వ, ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లో 8, 10 వ తరగతి చదువుకున్న విద్యార్థులు విద్యా సంవత్సరం 2026 –2027 వారు మాత్రమే అర్హులని, ఆన్‌లైన్ లో లేదా అఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చని తెలిపారు. అప్లికేషన్ కావాల్సిన వారు ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయంలో పొందవచ్చన్నారు. ఈ అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవాలంటే వివరా ల కోసం జవహర్ నవోదయ విద్యాలయ ఆఫీస్ లో సంప్రదించాలని, లేదా అధికారిక రిజిస్ట్రేషన్ పోర్టల్‌లో చూడాలని తెలిపారు. సెప్టెంబరు 30వ తేదీ లోపల దరఖాస్తు చేసుకోవాలన్నారు.
● అందించిన జేసీ కల్పనా కుమారి
ఒంగోలు సబర్బన్: పలు విభాగాల్లో అర్హత పొందిన వారికి ఉద్యోగ నియామక పత్రాలు జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి అందజేశారు. స్థానిక ప్రకాశం భవన్‌లోని తన చాంబర్‌లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో నియామక పత్రాలు ఇచ్చారు. జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధీనంలో నడుపుతున్న వన్ స్టాప్ సెంటర్‌లోని సెంటర్ అడ్మిన్, కేసు వర్కర్లకు, బాలసదనం, శిశు గృహాల్లోని రెండు హెల్పర్ పోస్టులకు సంబంధించి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. కొత్తగా నియామకం పొందిన మహిళా అభ్యర్థులను జేసీ అభినందించారు. కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి పద్మ, సునంద, ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.
అర్దవీడు: వెలగలపాయ లోయ గ్రామాల్లో బస్సు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాకర్ల ఆనకట్ట మీదుగా ఉన్న రహదారిపై ఆర్టీసీ బస్సులను మంగళవారం నిలిపివేయడంతో లోయ గ్రామాల ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. వెలిగొండ జలాలు కాకర్ల డ్యాముకు రాక ముందే బస్సు సర్వీసులు నిలిపేయడం, ప్రత్యామ్నాయ రోడ్డు ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. ఆటోలు కంభం నుంచి వెలగలపాయకు రూ.300 చార్జి వసూలు చేస్తున్నారని ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు చెబుతున్నారు. కంభం నుంచి వయా మిట్టమీదిపల్లి, శంకరాపురం మీదుగా అడవి ప్రదేశంలో నిర్మిస్తున్న ప్రత్యామ్నాయ రోడ్డును మాగుటూరు వరకు త్వరగా ఏర్పాటు చేసి బస్సు సర్వీసులు పునరుద్ధరించాలని లోయ గ్రామాల ప్రజలు కోరుతున్నారు.


