మందుబాబులపై రూ.12 లక్షల జరిమానా | - | Sakshi
Sakshi News home page

మందుబాబులపై రూ.12 లక్షల జరిమానా

Sep 3 2026 8:29 AM | Updated on Sep 3 2026 8:29 AM

కేవలం ఒక్క నెలలోనే 366 మంది మందుబాబులు కోర్టుకు.. ఆగస్టు నెల క్రైం రిపోర్టును విడుదల చేసిన ఎస్పీ హర్షవర్థన్‌ రాజు

ఒంగోలు టౌన్‌: ఆగస్టు ఒక్కనెలలోనే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల్లో 366 మందిని పట్టుకొని కోర్టులో హాజరుపరిచామని, వారిపై కోర్టు రూ.12 లక్షల జరిమానా విధించినట్లు ఎస్పీ హర్షవర్థన్‌ రాజు తెలిపారు. ఇద్దరు వ్యక్తులకు కోర్టు జైలు శిక్ష విధించినట్లు వివరించారు. బుధవారం ఆయన ఆగస్టు నెల క్రైం రిపోర్టును విడుదల చేశారు. మోటారు వాహనాల చట్టం కింద ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలపై మొత్తం 8,539 చలానా కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. దీనికి గాను రూ.42,82,910 జరిమానా విధించినట్లు వివరించారు. జిల్లాలో కోడి పందేలు, పేకాట వంటి జూదాలపై ప్రత్యేక దాడులు నిర్వహించామని, 200 మందిని అదుపులోకి తీసుకొని 37 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వారినుంచి రూ.7,24,750 నగదు, 7 కోళ్లు, 19 మోటారు సైకిళ్లు, 42 మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బహిరంగంగా మద్యం తాగే వారి మీద ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఒక్క నెలలోనే 926 కేసులు నమోదు చేసినట్లు వివరించారు. మద్యం తాగడానికి అనువుగా ఉన్న 935 ఖాళీ స్థలాలను శుభ్రం చేయించినట్లు చెప్పారు. రోడ్లను ఆక్రమించి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్న 143 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. న్యూసెన్స్‌ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేసి కోర్టులో జరిమానాలు, శిక్షలు విధించామన్నారు. గంజాయి నివారణలో భాగంగా ఒక కేసు నమోదు చేసి 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు తమ పరిధిలో గ్రామాలను సందర్శించి ప్రజలతో ముఖాముఖి మాట్లాడాలని, దొంగతనాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రతలను వివరించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement