కనిగిరిరూరల్:
కనిగిరిలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వైఎస్సార్ వర్ధంతిని పురస్కరించుకొని అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే పోలీసులు అత్యుత్సాం ప్రదర్శించడంతో కనిగిరిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే.. కనిగిరిలో కొన్నేళ్ల నుంచి ఒకే ప్రదేశంలో పట్టణంలోని చెక్ పోస్టు సమీపంలోని దర్గా ప్రాంతంలో అన్నదాన, సేవా హిత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బుధవారం కూడా వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా అన్నదానం నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. అయితే ఉదయం 8 గంటలకు కనిగిరి ఎస్సై జి.సందీప్ కుమార్, ఏఎస్సై శ్రీనివాసులరెడ్డిలు పోలీస్ సిబ్బందితో వచ్చి టెంట్లు పీకేశారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ శ్రేణులు సంఘటనా స్థలికి చేరుకొని ఎస్సైతో మాట్లాడారు. అయితే వారితోనూ ఎస్సై దురుసుగా మాట్లాడారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి దద్దాల నారాయణ ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులను ప్రశ్నించారు. సుమారు 16 ఏళ్లుగా ఇక్కడ అనేక కార్యక్రమాలు జరుపుకుంటున్నామని, ఇక్కడ ఎటువంటి ట్రాఫిక్ సమస్య లేదన్నారు. రోడ్డు మార్జిన్‌లో టెంట్ వేసి పేదలకు భోజనం పెడుతున్నామని, దాన్ని ఎందుకు ఇంత రాద్దాంతం ం చేస్తున్నారని ప్రశ్నించారు. దీనికి ఎస్సై స్పందిస్తూ..తనకు పై నుంచి ఆదేశాలు ఉన్నాయని, మా డ్యూటీ మేం చేస్తున్నామంటూ మొండిగా వాదించారు. దీన్ని దద్దాల ఖండించారు. గతంలో ఎప్పుడూ లేని ట్రాఫిక్ సమస్య ఇప్పుడు ఎందుకు వస్తోంది.. మీరు కావాలని వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారని, ఇది సరైన పద్ధతి కాదన్నారు.
ఎస్సైను నిలదీసిన దద్దాల
ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పుట్టినరోజు వేడుకల సందర్భంగా నడిరోడ్డుపై మున్సిపల్ కార్యాలయం ఎదురుగా టెండ్లు వేసి రోడ్లు బ్లాక్ చేశారని, ఇది మీ కళ్లకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కూటమి నేతలకు ఒక న్యాయం ..? మాకు ఒక న్యాయమా అని మండిపడ్డారు. కేవలం అధికార పార్టీ నేతల మెప్పు కోసమే పనిచేయడం ఏంటని ప్రశ్నించారు. ఈ క్రమంలో దద్దాల నారాయణ యాదవ్‌కు, ఎస్సైకు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకొని ఉద్రిక్తంగా మారింది.
ఎస్సై దురుసు ప్రవర్తన
వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా పేదలకు అన్నదానం ఏర్పాటుకు స్థానిక చెక్ పోస్టు వద్ద ఏర్పాటు చేసిన టెంట్లను ఎస్సై జి. సందీప్, పోలీసులు వచ్చి టెంట్లను తొలగించారు. విషయం తెలుసుకుని ముందుగా అక్కడికి చేరుకున్న పార్టీ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు వాకుమళ్ల రాజశేఖర్‌రెడ్డి దాన్ని అడిగారు. దీంతో ఎస్సై జి.సందీప్ యువజన నేతపై దురుసుగా వ్యహరించారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ పోలీస్ జీపు ఎక్కించేందుకు బలవంతంగా వాకుమళ్ల రాజశేఖరరెడ్డిని లాక్కెళ్లారు. దీన్ని చిత్రికరీంచేందు ప్రయత్నించిన ఓ మీడియా ప్రతినిధిపై ఎస్సై, ఏఎస్సైలు దుర్భాషలాడుతూ దురుసుగా వ్యహరించారు. మీడియా ప్రతినిధినని చెప్పినా వినకుండా లెక్కలేనితనంగా వ్యవహరించారు. ఎస్సై తీరుపై మీడియా ప్రతినిధులు సైతం నిరసన తెలిపారు. ఎస్సై, పోలీసుల తీరును ప్రెస్‌క్లబ్ నాయకులు ధూళ్లిపాళ్ల మల్లికార్జునరావు తీవ్రంగా ఖండించారు.
సమస్యను ఎస్పీ దృష్టికి తీసుకెళ్లిన బూచేపల్లి
ఎస్సై జి.సందీప్‌కుమార్ తీరుపై కనిగిరి ఇన్‌చార్జి దద్దాల నారాయణ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివ ప్రసాద్‌రెడ్డి సమస్యను ఎస్పీ వి హర్షవర్ధన్‌రాజు దృష్టికి తీసుకెళ్లి వివరించారు. విషయాన్ని సమగ్రంగా తెలుసుకున్న ఎస్పీ వెంటనే స్పందించి.. కార్యక్రమం జరుపుకునేందుకు కనిగిరి ఇన్‌చార్జి డీఎస్పీకి ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. దీంతో ఇన్‌చార్జి డీఎస్పీ పి. శ్రీధర్... పార్టీ కనిగిరి ఇన్‌చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్‌తో మాట్లాడారు. దీంతో తిరిగి అదే ప్రదేశంలో వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కనిగిరి ఇన్‌చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ విలేర్లతో మాట్లాడుతూ పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ఎస్సై జి.సందీప్ కుమార్ అధికార పార్టీ నేతలతో వత్తిడితోనే వైఎస్సార్ వర్ధంతిని అడ్డుకునేందుకు కుట్రలు చేశారన్నారు. వైఎస్సార్ సీపీ శ్రేణులపై ఎస్సై దురుసుగా వ్యవహరించిన తీరును తప్పుపట్టారు. ప్రజాస్వామ్యంలో ప్రతికా స్వేచ్ఛను అడ్డుకునే హక్కు ఎవరికి లేదని, ఎస్సై జి.సందీప్ కుమార్ మీడియా ప్రతినిధులపై వ్యహరించిన తీరును తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఎస్‌కే గఫార్, జెడ్పీటీసీలు మడతల కస్తూరిరెడ్డి, గుంటక తిరుపతిరెడ్డి, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధులు గాండ్లపర్తి ఆదినారాయణరెడ్డి, కటికల వెంకటరత్న, పార్టీ యూత్ నియోజకవర్గ అధ్యక్షుడు వాకుమళ్ల రాజశేఖర్‌రెడ్డి, పార్టీ మున్సిపల్ నియోజకవర్గ అధ్యక్షుడు సిరుప వెంకట గోవర్ధన్‌రెడ్డి, పలుకూరి భాస్కర్, దాదిరెడ్డి మాలకొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


