కందుకూరు: అక్రమ మద్యం అమ్మకాలపై జిల్లా టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి పట్టణంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. దీనిలో భాగంగా సూర్య బార్ అండ్ రెస్టారెంట్ సమీపంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి 88 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను పట్టణ పోలీసులకు అప్పగించారు. జిల్లాలో అక్రమ మద్యం విక్రయాలు, అక్రమ రవాణాకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ మద్యం అమ్మకాలకు సంబంధించి సమాచారం ఉంటే 112 నంబర్‌కు గానీ, 9121102266 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. దాడుల్లో టాస్క్‌ఫోర్స్ సీఐ కె.కమలాకర్, ఎస్సై సీహెచ్ చెంచయ్య, ఏఎస్సై షేక్ మహబూబ్‌బాషా పాల్గొన్నారు.
మద్దిపాడు: మండలంలోని నేలటూరులో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని ఎస్సై వెంకటసూర్య సిబ్బందితో కలిసి అదపులోనికి తీసుకున్నారు. నిందితుడు శేషారెడ్డి వద్ద 23 రకాల మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకొని నిందితున్ని అదుపులోనికి తీసుకున్నారు. ఎక్కడైనా మద్యం అక్రమంగా విక్రయిస్తున్నట్లు తెలిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు.
గిద్దలూరు రూరల్: గుర్తుతెలియని వాహనం ఢీకొని బైక్‌పై వెళుతున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని ముండ్లపాడు గ్రామ సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళితే..బురుజుపల్లె గ్రామానికి చెందిన శ్రీనివాసులు, అతడి భార్య భారతి, రెండేళ్ల కుమార్తె లోహితతో కలిసి బైక్‌పై గిద్దలూరుకు వచ్చి తిరిగి వెళుతున్న సమయంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాదంలో శ్రీనివాసులుకు రెండు కాళ్లకు తీవ్ర గాయాలవడంతో మెరుగైన వైద్యం నిమిత్తం నంద్యాలకు తరలించారు. ఆయన భార్య భారతి రెండు నెలల గర్భిణి. ఆమెను, కుమార్తెను గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలలో ఉంచి వైద్యసేవలను అందిస్తున్నారు.
ఒంగోలు వన్‌టౌన్: బాలల హక్కులు, సంరక్షణ చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్‌చార్జి కార్యదర్శి, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి సీహెచ్‌వీ రామకృష్ణ అన్నారు. నగరంలోని బాలసదన్‌న్‌ను బుధవారం జడ్జి సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా బాలలకు చట్టాలపై అవగాహన కల్పించారు. బాలల సంరక్షణ చట్టాలు, బాలల హక్కులు, బాలలపై జరిగే వేధింపులు గురించి వివరించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా బాలలకు అందిస్తున్న ఉచిత న్యాయ సహాయం, న్యాయ సలహాలు, వివిధ సంక్షేమ పథకాలు గురించి విద్యార్థులకు వివరించారు. ఏదైనా చట్టపరమైన సమస్య ఎదురైనప్పుడు భయపడకుండా సంబంధిత అధికారులను లేదా జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని సూచించారు. జువనైల్ జస్టిస్ లీగల్ అడ్వైజర్ రత్న ప్రసాద్, బాలసదన్ సూపరింటెండెంట్ మహాలక్ష్మి, ప్యానెల్ న్యాయవాది తదితరులు పాల్గొన్నారు.


