కంభం: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన బుధవారం తెల్లవారుజామున స్థానిక హైవే రోడ్డుపై జరిగింది. వివరాల్లోకి వెళితే..బుధవారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న 60 ఏళ్ల వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి మృతుని వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
బేస్తవారిపేట: మండలంలోని పందిళ్లపల్లె టోల్‌ప్లాజా సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. ఆళ్లగడ్డ మండలం మిట్టపల్లెకు చెందిన శేఖర్, షఫీలు మోటార్‌సైకిల్‌పై కంభం వైపునకు వెళ్తున్నారు. అదే సమయంలో బొలెరో వాహనం కంభం వైపు వెళ్తుండగా వెనుక వైపున ఢీకొట్టారు. ఈ సంఘటనలో మోటార్‌సైకిల్ అదుపుతప్పి రోడ్డుపై పడిపోవడంతో శేఖర్ తలపగిలి తీవ్రంగా గాయపడ్డాడు. షఫీకి కూడా గాయాలయ్యాయి. క్షతగాత్రులను హైవేరోడ్డు అంబులెన్స్‌లో కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
బేస్తవారిపేట: పాముకాటుకు మహిళ మృతి చెందింది. ఈ సంఘటన మండలంలోని పూసలపాడులో బుధవారం జరిగింది. బొగ్గు వెంకట లక్ష్మమ్మ(48) చిక్కుడు పంట సాగు చేస్తున్న పొలంలో గడ్డి కోసేందుకు వెళ్లగా పాముకాటుకు గురైంది. గట్టిగా కేకలు పెట్టడంతో కుటుంబ సభ్యులు ఆటోలో కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలికి భర్త చిన్న రంగయ్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ఒంగోలు సబర్బన్: జిల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఈఈ)గా సీహెచ్.రాజశేఖర్ నియమితులయ్యారు. తిరుపతిలో ఈఈగా పనిచేస్తున్న ఆయన్ను రాష్ట్ర హెడ్ క్వార్టర్‌కు బదిలీ చేశారు. రాష్ట్ర హెడ్ క్వార్టర్‌లో విధులు నిర్వర్తిస్తూనే ప్రకాశం జిల్లా ఈఈగా రాజశేఖర్‌ను కేటాయిస్తూ అదనపు బాధ్యతలు(ఎఫ్‌ఏసీ) ఉన్నతాధికారులు అప్పగించారు. ఇక్కడ ఈఈగా పనిచేస్తున్న విజయ మోహన్ మృతి చెందటంతో విజయవాడ రీజినల్ కార్యాలయంలో ఈఈగా పనిచేస్తున్న పి.శ్రీనివాస్‌ను ప్రకాశం జిల్లాకు కేటాయిస్తూ అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం రాజశేఖర్‌ను కూడా ఎఫ్‌ఏసీ కింద కేటాయించారు. ఇప్పటి వరకూ పనిచేస్తున్న పి.శ్రీనివాస్‌ను తిరిగి విజయవాడ రీజినల్ కార్యాలయానికి రావాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఒంగోలు వన్‌టౌన్: జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ హాలులో బుధవారం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చావలి రమేష్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సమావేశంలో కర్నూలులో రాష్ట్ర హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుండటం, కర్నూలు హైకోర్టు బెంచ్‌లో ప్రకాశం జిల్లాను కూడా కలపడంతో న్యాయవాదులు గురువారం విధులు బహిష్కరించి నిరసన తెలపనున్నారు. ప్రకాశం జిల్లాకు కర్నూలు దూరంలో ఉందని, అదే విజయవాడ అయితే దగ్గరగా ఉంటుందన్నారు. ప్రకాశం జిల్లాను విజయవాడ హైకోర్టు పరిధిలోనే కొనసాగించాలనికోరుతున్నారు. రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని నిర్ణయించామన్నారు.


