ఒంగోలు టౌన్: బియ్యం ధరలు విపరీతంగా పెరగడంతో కడుపునిండా అన్నం తినలేని పరిస్థితి ఏర్పడిందని, పంచదార ధరలు పెంచడంతో కనీసం టీ తాగే పరిస్థితి కూడా లేకుండా పోయిందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి కంకణాల రమాదేవి విమర్శించారు. పెరిగిన ధరలను తగ్గించాలని కోరుతూ ఐద్వా మహిళా సంఘం ఆధ్వర్యంలో నగరంలోని సత్యనారాయణపురంలో ఖాళీ గ్యాస్ సిలిండర్, సరుకులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ జూలై, ఆగస్టు నెలల్లో నిత్యావసర వస్తువుల ధరలు ఏకంగా 40 శాతం నుంచి 75 శాతానికి ఆమాంతం పెరిగాయన్నారు. బియ్యం, వంటనూనెలు, కందిపప్పు, ఉల్లిపాయలు పెరగడంతో నిరుపేద, మధ్య తరగతి ప్రజలు అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నెల రోజుల క్రితం కిలో రూ.40 ఉన్న పంచదార రూ.80లకు చేరిందని, బియ్యం రూ.1050 నుంచి రూ.1500లకు పెరిగిందన్నారు. రోజురోజుకు ధరలు ఇలా పెరిగిపోతే పేదలు ఏం తిని బతకాలని ప్రశ్నించారు. నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించడం చేతకాని పాలకులు అరకొర సంక్షేమ పథకాలతో పేదలకు తామేదో మేలు చేస్తున్నట్లు ఫోజులు కొట్టడం సిగ్గుచేటని విమర్శించారు. దేశ సంపదను, దేశంలోని ప్రజల కష్టాన్ని కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవని హెచ్చరించారు. ఆహార భద్రతా చట్టం కింద రేషన్ దుకాణాల ద్వారా 14 రకాల నిత్యావసర వస్తువులను సబ్సిడీ ధరలకు అందజేయాలని డిమాండ్ చేశారు. ఐద్వా నగర కార్యదర్శి జి.ఆదిలక్ష్మి మాట్లాడుతూ ఎల్‌నినో పేరుతో నల్లబజారు వ్యాపారస్తులు ధరలను పెంచి ప్రజలను దోచుకుంటున్నారని మండిపడ్డారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఔట్ సోర్సింగ్ , కాంట్రాక్ట్ ఉద్యోగులకు వేతనాలు పెంచడం లేదని, రోజువారి కూలీలను పెంచడంలేదని, అలాంటప్పుడు చిరువ్యాపారులు, చిరుద్యోగులు ఎలా బతకాలని ప్రశ్నించారు. వర్షాభావంతో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నా ముందస్తు చర్యలు తీసుకోవడంలో పాలకులు విఫలమవుతున్నారని ఆరోపించారు. కార్పొరేట్ కంపెనీల లాభాల కోసం దేశంలో పండిన చెరుకును ఈ 20 ఆయిల్ తయారికీ తరలించి పేదల కడుపులు కొడుతున్న మోదీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే సమయం ఆసన్నమైందని హెచ్చరించారు. ఈ నెల 7న న కలెక్టరేట్ వద్ద జరిగే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మహిళా నాయకురాలు అంజనీదేవి, రంగమ్మ, నాగేశ్వరమ్మ, రాధారాణి, శ్రీరంజనీ, పద్మ కమల, అనిత, అన్నపూర్ణ, ఈశ్వరమ్మ, నాగలక్ష్మి, జ్యోతి , ఏ.రమాదేవి పాల్గొన్నారు.
పెరిగిన ధరలపై ఐద్వా ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన


