గిద్దలూరు రూరల్: విధుల్లో నిర్లక్ష్యం వహించిన తురిమెళ్ల రేంజ్ ఆఫీసర్ బి.మధుప్రియాంకను అటవీ శాఖ పీసీసీఎఫ్ పీవీ చలపతిరావు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పొట్టిశ్రీరాములు నెల్లూరులో పనిచేస్తూ 2022 తురిమెళ్ల రెంజ్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అయితే జూలై 31న గుండకమ్మ రేంజ్ పరిధిలోని రాచర్ల బీటులో లభ్యమైన పెద్దపులి మృతదేహం కేసులో నిందితులు తురిమెళ్లరేంజి పరిధిలోని జేపీ చెరువు గ్రామానికి చెందిన వారై ఉండగా వారు పులిని వేటాడి చంపి చనిపోయిన పులిని గుండ్లకమ్మ రేంజ్ పరిధిలోకి తీసుకువచ్చి పడేశారని అటవీశాఖ ఉన్నతాధికారుల విచారణలో తేలింది. ఆ కేసులో వేటగాళ్లు తురిమెళ్ల రేంజ్ పరిధిలో ఉన్నారని గుర్తించడంలో జాప్యం వహిస్తూ నిర్లక్ష్యం వహించించారనేది కారణం ఒకటి. కాగా గత నెల 23న రాచర్ల మండలం సంగపేటకు చెందిన ముగ్గురు వ్యక్తులు కుందేలును వేటాడి పట్టుబడగా వారి పై ఎటువంటి కేసు నమోదు చేయకుండా వదిలేయడం వంటి కారణాలతో ఆమెను సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. గతంలోను రాచర్ల బీటులోని ఆరవీటికోట సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాల విషయంలో సస్పెండ్ అయిన ఎఫ్‌బీఓ గఫార్‌తో కలిసి ఫొటోలు దిగిన దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్టు చేయడం వంటి బాధ్యతారహితమైన చర్యలకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నట్లు సమాచారం. వన్యప్రాణుల సంరక్షణ చట్టాల ఉల్లంఘనపై తురిమెళ్ల రేంజ్ ఆఫీసర్ పై చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.


