గిద్దలూరు రూరల్: గిద్దలూరు పట్టణ శివారులోని ఎస్సీ బాలుర వసతి గృహంలోని విద్యార్థుల తల్లిదండ్రులు వసతి గృహం వద్ద నిరసన తెలియజేసిన సంఘటన మంగళవారం రాత్రి జరిగింది. అందిన వివరాల ప్రకారం వసతి గృహంలోని విద్యార్థులను కలిసేందుకు తల్లిదండ్రులు వచ్చిన సమయంలో వారిని కలవనివ్వకుండా గేట్లు వేసే ప్రయత్నం చేశారు. తరువాత విద్యార్థులు వారి తల్లిదండ్రులను కలిసి వసతి గృహంలో వసతులు సక్రమంగా లేవని, వార్డెన్ అందుబాటులో ఉండరని వారి సమస్యలను వివరించారు. ప్రభుత్వం నుంచి వచ్చిన చిక్కీలు, దుప్పట్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. వసతి గృహంలో శుభ్రత, పరిశుభ్రత పాటించడం లేదంటూ వాపోయారు. దీంతో విద్యార్థులు తల్లిదండ్రులు కలిసి వసతి గృహం వద్ద నిరసన తెలియజేస్తూ వారి సమస్యలు వివరించారు. ఉన్నతాధికారులు వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిందిగా వారు కోరారు. ఈ విషయమై వార్డెన్ రాజేష్‌కు ఫోన్ చేయగా ఆయన ఫోన్‌లో స్పందించలేదు.


