సీఎం చంద్రబాబు నోట అబద్ధాల ప్రవాహం | - | Sakshi
Sakshi News home page

సీఎం చంద్రబాబు నోట అబద్ధాల ప్రవాహం

Sep 1 2026 3:00 AM | Updated on Sep 1 2026 3:00 AM

మార్కాపురం: వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వెలిగొండ ప్రాజెక్టు సభలో మాట్లాడిన మాటలన్నీ పచ్చి అబద్ధాలని గిద్దలూరు వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రాజెక్టు క్రెడిట్‌ను కొట్టేసేందుకు చంద్రబాబు నీచమైన ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వెలిగొండకు 1996లో తానే శంకుస్థాపన చేశానని, అంతా తానే పూర్తి చేశానని చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదమని కేపీ నాగార్జునరెడ్డి ఎద్దేవా చేశారు. 1996 నుంచి 2004 వరకు అధికారంలో ఉన్న ఎనిమిదేళ్ల కాలంలో చంద్రబాబు ఈ ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కూడా కేటాయించని మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఈ నిజాన్ని పక్కనబెట్టి మంత్రి నిమ్మల రామానాయుడు గంటావానిపల్లె సభలో చంద్రబాబును ఆకాశానికెత్తడం విడ్డూరంగా ఉందన్నారు. 2004లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి గొట్టిపడియ, సుంకేసుల, కాకర్ల గ్యాప్‌లు, రెండు టన్నెళ్లకు భారీగా నిధులు కేటాయించి వెలిగొండ పనులను పరుగులు పెట్టించారని గుర్తు చేశారు. మొత్తం ప్రాజెక్టు పనుల్లో 70 నుంచి 75 శాతం వైఎస్సార్‌ హయాంలోనే పూర్తయ్యాయని, 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు జమానాలో కేవలం 5.5 కిలోమీటర్ల టన్నెల్‌ పనులు మాత్రమే జరిగాయని వివరించారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండేళ్లు కరోనా సంక్షోభం ఉన్నప్పటికీ, మిగిలిన మూడేళ్లలో రికార్డు స్థాయిలో 13 కిలోమీటర్ల మేర టన్నెల్‌ పనులను పూర్తి చేశారని పేర్కొన్నారు. చరిత్ర ఇలా ఉంటే, వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం కేవలం 2 శాతం పనులే చేసిందంటూ చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధాలు వల్లె వేశారని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే నెల్లూరు వరకు వందల కిలోమీటర్ల కెనాల్స్‌ ఎలా పూర్తి చేశారో కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీశారు. టీబీఎం మిషన్‌ను లోపలే నిర్మూలించి సులభంగా నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నా, తన అనుచరులకు దోచిపెట్టేందుకే దాన్ని తీసే నెపంతో రూ.100 కోట్లు కేటాయించారని ఆరోపించారు.

మాగుంట వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి

వైఎస్సార్‌ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని కేపీ నాగార్జునరెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్‌, వైఎస్‌ జగన్‌ దయతో రాజకీయంగా ఎదిగి, పదవులు అనుభవించిన మాగుంటకు వైఎస్‌ జగన్‌ను విమర్శించే నైతిక అర్హత లేదన్నారు. మాగుంట తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

వెలిగొండ ఘనత ముమ్మాటికీ వైఎస్సార్‌ కుటుంబానిదే..

జగన్‌ చేసిన పనులను తానే చేసినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటు

వైఎస్సార్‌ హయాంలోనే 75 శాతం పనులు పూర్తి

ఎంపీ మాగుంట బేషరతుగా క్షమాపణ చెప్పాలి

మాజీ ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి ధ్వజం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement