ఒంగోలు సబర్బన్: ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన హక్కుల సాధన కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నట్లు ఏపీ జేఏసీ అమరావతి జిల్లా కమిటీ ప్రకటించింది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ కేంద్రంలో కలెక్టర్ పి.రాజాబాబుకు ఉద్యమ కార్యాచరణ నోటీసును జేఏసీ జిల్లా నాయకులు అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.
పీఆర్‌సీ కమిషన్‌ను వెంటనే నియమించాలి
ఏపీ జేఏసీ అమరావతి జిల్లా కమిటీ ఇన్‌చార్జ్ చైర్మన్ జి.ఆంజనేయులు మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కొత్త పీఆర్‌సీ కమిషన్‌ను వెంటనే నియమించడంతో పాటు మధ్యంతర భృతి(ఐఆర్) ప్రకటించాలని కోరారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఉద్యోగులకు రావాల్సిన డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. సచివాలయ ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియను వేగవంతం చేయాలని, ఏళ్ల తరబడి సేవలందిస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని స్పష్టం చేశారు. ఉద్యోగుల కుటుంబ సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం ప్రకటించిన ఉద్యమ కార్యాచరణలో జిల్లాలోని ప్రతి ఉద్యోగి భాగస్వామ్యమై ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏపీ జేఏసీ అమరావతి ప్రకాశం జిల్లా కార్యదర్శి పోలయ్య, ట్రెజరర్ బాలసుబ్రమణ్య కుమార్, వైస్ ప్రెసిడెంట్ ఊతకోలు శ్రీనివాసరావు, ప్రశాంత్, రాము, డ్రైవర్స్ సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రసన్న కుమార్, ఎలీషా, ఉమెన్ వింగ్ సెక్రటరీ ఎన్.శ్రీదేవి, లావణ్య, అనంతలక్ష్మి, హసీనా, హరిత, మీనా, మేరీ గౌరీ, సెక్రటరీ జి.శ్రీనివాసులు, కె.వెంకటేశ్వర్లు, హెడ్‌మాస్టర్స్ సంఘం నేత వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు కలెక్టరేట్ రెవెన్యూ ఉద్యోగులు, ఏపీఎస్‌ఆర్‌టీసీ, కోఆపరేటివ్, గ్రామ/వార్డు సచివాలయ, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, మహిళా, రిటైర్డ్ ఉద్యోగులు భారీ సంఖ్యలో పాల్గొని ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
కలెక్టర్‌కు నోటీసు అందజేసిన ఏపీ జేఏసీ అమరావతి జిల్లా కమిటీ
పీఆర్‌సీ కమిషన్ వేయడంతోపాటు ‘ఐఆర్’ ప్రకటించాలని డిమాండ్
డీఏ బకాయిలు చెల్లించాలి.. సచివాలయ ఉద్యోగులకు పదోన్నతి కల్పించాలి
ఉద్యోగుల జేఏసీ జిల్లా ఇన్‌చార్జ్ చైర్మన్ ఆంజనేయులు


