● రోడ్డు పక్కన నిలిబెట్టి ఉన్న కారు అద్దాలు ధ్వంసం
● రాజీ చేసేందుకు రంగంలోకి దిగిన టీడీపీ నాయకులు
● టూ టౌన్ పోలీసు స్టేషన్లో రాజీ యత్నాలు
సాక్షి టాస్క్‌ఫోర్స్: మద్యం మత్తులో ఉన్న యువకులు కొందరు డీఎస్పీ ఆఫీసు సమీపంలో రోడ్డు పక్కన ఆపి ఉన్న కారు అద్దాలను ధ్వంసం చేయడం కలకలం సృష్టించింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నగరానికి చెందిన ఏసీ మెకానిక్ షేక్ నజీర్ ఆర్టీసీ బస్సులో కొప్పోలు వైపు వెళ్తున్నాడు. బస్సు గేటు వద్ద నిలుచున్న నజీర్‌కు డీఎస్పీ ఆఫీసు దాటిన తరువాత ఒక కారు ఎదురైంది. కారు డ్రైవర్ హారన్ కొడుతుండడంతో హారన్ కొట్టొద్దని నజీర్ సైగలు చేశాడు. అయినా అతడు పట్టించుకోలేదు. దాంతో ఫ్లైఓవర్ వద్ద బస్సులోంచి దిగిన నజీర్ హారన్ కొడుతున్న కారు డ్రైవర్‌తో వాదన పెట్టుకున్నాడు. వారిద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. కారు డ్రైవర్ అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఆ తరువాత స్నేహితుడికి ఫోన్ చేసి పిలిపించుకున్న నజీర్ కొత్తపట్నం బస్టాండు సెంటర్‌కు చేరుకొని పూటుగా మద్యం తాగాడు. తిరిగి కొప్పోలు వైపు వెళుతున్న సమయంలో డీఎస్పీ ఆఫీసుకు కొద్ది దూరంలో రోడ్డు పక్కన ఒక కారు కనిపించింది. తనతో వాదన పెట్టుకున్న కారు ఇదేనని పొరబడిన నజీర్, అతడి స్నేహితుడు ఇద్దరు కలిసి కారు అద్దాలు ధ్వంసం చేశారు. ఒక బ్యాంకులో ఉద్యోగం చేసే రాయపాటి బాబురావు రోడ్డుకు అవతల వైపు నివాసం ఉంటారు. ఇంటి వద్ద పార్కింగ్ లేకపోవడంతో కారును డీఎస్పీ ఆఫీసుకు కొద్ది దూరంలో రోడ్డు పక్కన పెట్టుకున్నారు. మందుబాబుల దాడిలో కారు పూర్తిగా ధ్వంసమైంది. స్థానిక యువకులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే రంగంలోకి దిగిన టూ టౌన్ పోలీసులు మందుబాబులను అదుపులోకి తీసుకున్నారు. సమాచారం తెలిసిన వెంటనే కమ్మపాలెంకు చెందిన ఒక టీడీపీ నాయకుడు, 8వ డివిజన్ మాజీ కార్పొరేటర్ పోలీసు స్టేషన్‌కు చేరుకొని రాజీ యత్నాలు చేశారు. అయితే బాబురావు అంగీకరించకపోవడంతో చేసేదేమీ లేక వెనుదిరిగారు. టూ టౌన్ పోలీసులు ఫిర్యాదును విచారిస్తున్నారు.


