గెజిట్‌లో పేర్లు మాయం.. నిర్వాసితుల గుండెల్లో గాయం
ముంచినా సరే..
పెద్దారవీడు: మూడు జిల్లాల దాహార్తిని తీర్చేందుకు, లక్షలాది ఎకరాల బీడు భూములకు జీవం పోసేందుకు తరతరాలుగా పెనవేసుకున్న జ్ఞాపకాలను, పుట్టిన గడ్డను, పంట పొలాలను త్యాగం చేసిన నిర్వాసితులపై చంద్రబాబు సర్కారు కనికరం లేకుండా వ్యవహరిస్తోంది. కనీసం పునరావాస ప్యాకేజీ (ఆర్ అండ్ ఆర్) డబ్బు లు బ్యాంకు ఖాతాల్లో జమ చేయకుండానే ఇళ్లను ఖాళీ చేసి తక్షణం ఊరు వదిలి వెళ్లిపోవాలంటూ అధికారులు జులుం ప్రదర్శిస్తుండటం తీవ్ర ఆగ్రహానికి దారితీస్తోంది. నయాపైసా చేతికివ్వకుండా గడప దాటమంటే ఎక్కడికి వెళ్లాలని, ఇక్కడే ప్రాణాలైనా విడుస్తాం కానీ పరిహారం అందేంత వరకు గ్రామం విడిచి వెళ్లే ప్రసక్తే లేదని సుంకేసుల, కలనూతల, గుండంచర్ల గ్రామాల ప్రజలు తెగేసి చెబుతున్నారు.
పరిహారం మా హక్కు.. భిక్ష కాదు!
భూసేకరణ చట్టం–2013 సెక్షన్ 38 ప్రకారం నిర్వాసితులకు ఇళ్లు ఖాళీ చేయడానికి కనీసం 6 నెలల గడువు ఇవ్వాల్సి ఉంది. అలాగే 2006 నాటి పాత సర్వేను సవరించి, ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీతో పాటు ఇంటి నివేశన స్థలాలు ఇవ్వాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో రోడ్లు, తాగునీరు, విద్యుత్ తదితర కనీస మౌలిక వసతులు కల్పించిన తర్వాతే ఇళ్లను ఖాళీ చేయించాల్సి ఉన్నా అధికారులు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం ఎవరి భిక్ష కాదని, సర్వం కోల్పోతున్న తమకు చట్టబద్ధంగా దక్కాల్సిన హక్కని నిర్వాసితులు స్పష్టం చేస్తున్నారు.
ప్రారంభోత్సవ ఆరాటం.. బాధితులపై పగ!
ముంపు గ్రామాలైన సుంకేసుల, కలనూతల, గుండంచర్లలో దాదాపు 500 కుటుంబాలు, 1,500 మంది ప్రజలు జీవనం సాగిస్తున్నారు. వీరి సమస్యలను పరిష్కరించకుండా గ్రామం దాటించాలని చూడటం దారుణమని ప్రజలు మండిపడుతున్నారు. సీఎం చంద్రబాబు ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వస్తున్నారంటూ టీడీపీ నేతలు ప్రచారాలు, జన సమీకరణపై పెడుతున్న శ్రద్ధ ముంపు బాధితుల సమస్యలపై పెట్టడం లేదని బాధితులు ధ్వజమెత్తుతున్నారు. ప్యాకేజీ అందిన కొందరి వద్ద నుంచి కూడా దళారులు, పచ్చ నేతలు కమీషన్ల రూపంలో దోచుకుంటున్నారే తప్ప, జాబితాలో పేర్లు గల్లంతైన బాధితులకు న్యాయం చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు. ఊళ్లో ఉండగానే ఖాతాల్లో డబ్బులు జమ చేయని అధికారులు, ఊరు దాటి వెళ్లాక ఇస్తారంటే ఎలా నమ్ముతామని ప్రశ్నిస్తున్నారు. తమకు రావాల్సిన ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ సొమ్ము బ్యాంకు ఖాతాల్లో పడిన తర్వాతే గ్రామాలు వదిలి వెళ్తామని, అప్పటిదాకా కదిలేది లేదని నిర్వాసితులు కరాఖండిగా తేల్చిచెబుతున్నారు.
వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో బాధితుల కన్నీటి రోదన
ఆర్‌అండ్‌ఆర్ గెజిట్ జాబితాలోవందలాది పేర్లు గల్లంతు
పరిహారం తమ హక్కు.. భిక్ష కాదని నిర్వాసితుల ఆక్రందన
ప్యాకేజీ ఇవ్వకుండా పొమ్మంటే ఎక్కడికి పోవాలని నిలదీత
నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్న చంద్రబాబు సర్కారు


