యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రవి డిమాండ్
ఒంగోలు సిటీ: పదవీ విరమణకు దగ్గర పడిన ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులను టెట్ పరీక్షల పేరుతో మానసికంగా వేధించడం తగదని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.రవి పేర్కొన్నారు. టెట్ నుంచి వీరికి పూర్తి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంగళవారం సాయంత్రం ఒంగోలులో నిర్వహించిన నిరసన ర్యాలీలో ఆయన మాట్లాడారు. యాభై ఏళ్లు పైబడిన ఉపాధ్యాయులు ఒకవైపు విద్యార్థులకు బోధన చేస్తూనే, మరోవైపు 25 ఏళ్ల క్రితం చదివిన అంశాలపై పరీక్షలు రాయమనడం అశాసీ్త్రయమన్నారు. నోటిఫికేషన్ సిలబస్ కంటే ప్రశ్నలు కఠినంగా ఉంటున్నాయని, ఇటీవల జరిగిన జనరల్ టెట్‌లో ఎక్కువ మందికి 60–70 మార్కులే వచ్చాయని, ఉత్తీర్ణత శాతం చాలా తక్కువగా ఉందని గుర్తుచేశారు. ఓసీలకు 90, బీసీలకు 75, ఎస్సీ, ఎస్టీలకు 60 మార్కులు సాధించాలనే నిబంధన వారిలో ఆందోళన కలిగిస్తోందన్నారు. 2010కి ముందు విధుల్లో చేరిన వారికి టెట్ నుంచి పూర్తిగా మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఎన్‌సీటీఈ విద్యాహక్కు చట్టం సెక్షన్ 23(1) సవరణ కోసం కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలన్నారు. ఉపాధ్యాయులు తాము బోధించని సబ్జెక్టుల్లోనూ పరీక్ష రాయాల్సి వస్తోందని, కేవలం బోధించే సబ్జెక్టులోనే పరీక్ష నిర్వహించడంతో పాటు అర్హత మార్కులను తగ్గించాలని కోరారు. 80 శాతం మంది ఉపాధ్యాయులకు కంప్యూటర్ పరిజ్ఞానం లేనందున పరీక్షను ఆఫ్‌లైన్‌లోనే జరపాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ హై మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉపాధ్యాయులకు మినహాయింపులతో స్పెషల్ టెట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. స్పందించకపోతే అన్ని ఉపాధ్యాయ సంఘాలను ఏకతాటిపైకి తెచ్చి పెద్దఎత్తున ఉద్యమిస్తామన్నారు. ఈ నెల 26 నుంచి 29 వరకు బైక్ జాతాలు, 31న ’చలో విజయవాడ’తో పాటు నిరవధిక నిరాహార దీక్షలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో సహ అధ్యక్షుడు వై.వెంకట్రావు, ఉపాధ్యక్షురాలు జి.ఉమామహేశ్వరి, జిల్లా కోశాధికారి ఎన్.చిన్నస్వామి, జిల్లా కార్యదర్శులు సీహెచ్ ప్రభాకర్ రెడ్డి, రమణమూర్తి, తాతా వెంకటేశ్వర్లు, కె.లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.


