ఒంగోలు టౌన్: రాష్ట్రంలోని పొగాకు రైతులకు మభ్యపెట్టే మాటలు చెబుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచారని సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు ధ్వజమెత్తారు. నగరంలోని మల్లయ్యలింగం భవనంలో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పెట్టుబడులు, ఉత్పత్తి ఖర్చులను పరిగణనలోకి తీసుకుని వర్జీనియా పొగాకుకు కిలోకు రూ.250 గిట్టుబాటు ధర ఇవ్వాలని, రూ.1,000 కోట్ల నిధులతో ప్రభుత్వరంగ సంస్థల ద్వారా కొనుగోళ్లు జరపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోవడంతోనే రైతులు ట్రాక్టర్ ర్యాలీలు, జాతీయ రహదారుల దిగ్బంధనానికి దిగారని గుర్తుచేశారు. కిలో పొగాకు రూ.200కు తగ్గకుండా కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు, ఆచరణలో వ్యాపారులకు ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. సమీక్షల పేరుతో కాలయాపన చేసి కార్పొరేట్లకు అనుకూలంగా ధరలు నిర్ణయించారని ఆరోపించారు. బ్రైట్ పొగాకుకు రూ.230, మీడియం ట్రేడ్‌కు రూ.190, ఆఫ్ స్టైల్‌కు రూ.130, లో గ్రేడ్‌కు రూ.110గా ఖరారు చేయడం రైతుల దోపిడీకి దారితీసిందన్నారు.
40 రోజుల్లో రూ.26 తగ్గిన ధర
జూన్ 18న సగటున రూ.226 ఉన్న పొగాకు ధర, సీఎం సమీక్షల అనంతరం 40 రోజుల వ్యవధిలో రూ.202కి పడిపోయిందని తెలిపారు. వ్యాపారులపై చర్యలు తీసుకోవాల్సిన ముఖ్యమంత్రే వారికి వత్తాసు పలకడం వెనుక ఆంతర్యమేమిటని నిలదీశారు. మార్కెట్‌లో ఏ పంటకూ గిట్టుబాటు ధర కల్పించలేని ప్రభుత్వం, ధర లేని పంటలు ఎందుకు వేశారంటూ రైతులపైనే ఎదురుదాడికి దిగడం దారుణమన్నారు.
సెప్టెంబర్ 7న విజయవాడలో నిరసన
రైతుల శ్రమను దోచుకుంటున్న కార్పొరేట్లకు 99 పైసలకే ఎకరం భూములు కట్టబెడుతున్నారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలపై సెప్టెంబర్ 7న విజయవాడలో నిర్వహించే నిరసన ప్రదర్శనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.వడ్డే హనుమారెడ్డి, పమిడి వెంకటరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రైతు నేతలు ఎస్.లలిత కుమారి, కోడూరి హనుమంతరావు, బీమవరపు సుబ్బారావు, పరిటాల కోటేశ్వరరావు, నాంచార్లు పాల్గొన్నారు.
సీఎం సమీక్షలు చేశాక కిలోకు రూ.26 తగ్గడం వెనక రహస్యం ఏంటి?
రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర ఉందో చెప్పాలి
వచ్చేనెల 7న విజయవాడలో భారీ నిరసన ప్రదర్శన
సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు


