కలెక్టరేట్‌ను ముట్టడించిన వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలు ఇప్పటికిప్పుడు వెళ్లాలని నోటీసులు ఇస్తే ఎలా.. ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వకుండా గ్రామాలను ఖాళీ చేయడం అసాధ్యం నిర్వాసితులకు అండగా మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఎమ్మెల్యే కందులను చుట్టుముట్టిన నిర్వాసితులు
మార్కాపురం టౌన్: వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలు తమ సమస్యలను పరిష్కరించి తగిన సమయం ఇస్తే గ్రామాలను ఖాళీ చేసి వెళ్లేవారమని, అలా కాకుండా ఇప్పటికిప్పుడు నోటీసులు ఇచ్చి గ్రామాలను ఖాళీ చేయాలంటే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించుకునేందుకు సోమవారం కలెక్టరేట్ వద్దకు గుండంచర్ల, గొట్టిపడియ, కలనూతల, సుంకేశుల తదితర గ్రామాలకు చెందిన వందల సంఖ్యలో నిర్వాసితులు చేరుకున్నారు. వీరిని కలెక్టర్ వద్దకు వెళ్లకుండా పోలీసులు గేటువద్ద ఆపారు. గేటువద్ద కొంతసేపు తమ డిమాండ్లను పరిష్కరించాలని నిర్వాసితులు నినాదాలు చేశారు. అనంతరం కలెక్టరేట్ లోనికి వెళ్లేందుకు పోలీసులను, గేట్లను నెట్టుకుంటూ లోనికి వెళ్లారు. కలెక్టరేట్ గేటు వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమకు న్యాయం చేయాలని భీష్మించారు. దీంతో కలెక్టరేట్‌లో ఉన్న ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి బయటకు వచ్చి నిర్వాసితులతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే కలెక్టర్ బయటకు వచ్చి తమకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేయడంతో కొంతసేపటి తరువాత బయటకు వచ్చిన కలెక్టర్ ప్రభుత్వ నిర్ణయం మేరకు నోటీసులు ఇచ్చామని, నీళ్లొదిలే సమయానికి ఖాళీచేయాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. నిర్వాసితులు తమకు ఆర్‌ఆర్‌ప్యాకేజీ ఇవ్వకపోవడంతోపాటు 2013 చట్టం ప్రకారం నిర్వాసితులకు నష్టపరిహారం ఇచ్చిన తరువాత 6 నెలల సమయం ఇవ్వాలని కోరారు. ఇప్పటికీ సుమారు 2500 మందికి మాత్రమే నష్టపరిహారం ఇచ్చానని, ఇంకా 4500 మంది నష్టపరిహారం రావాల్సి ఉండగా తరువాత 18 ఏళ్లు నిండినవారు సుమారు 1500 మంది ఉన్నారని, గెజిట్‌లో తమ పేర్లు రానివారు సుమారు 400 మంది ఉన్నారని, అందరికీ న్యాయం జరిగితేనే గ్రామాలను ఖాళీ చేస్తామని నిర్వాసితులు స్పష్టం చేశారు.
నిర్వాసితులకు అండగా అన్నా రాంబాబు..
ముంపు గ్రామాల నిర్వాసితులు కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు కలెక్టరేట్‌కు వచ్చి నిర్వాసితులతో మాట్లాడారు. వారు పడుతున్న ఇబ్బందులు, ఆవేదనను తెలుసుకున్నారు. ప్రభుత్వం అనాలోచితంగా ముందుకెళితే 13 గ్రామాల్లోని ముంపు గ్రామాల నిర్వాసితులు తమ ఇళ్లు ఖాళీచేసి రోడ్డున పడతారని, ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచించి వారికి తక్షణమే న్యాయం చేయాలని అన్నా రాంబాబు డిమాండ్ చేశారు. అనంతరం పీజీఆర్‌ఎస్‌లో ఉన్న కలెక్టర్ విజయసునీత, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు వద్దకు వెళ్లి నిర్వాసితుల డిమాండ్లను, సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. మానవతా దృక్పథంతో ఆలోచించి వారి సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
కందులను చుట్టిముట్టిన నిర్వాసితులు:
కలెక్టరేట్ వద్ద నిర్వాసితుల ధర్నా చేస్తుండగా అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డిని నిర్వాసితులు చుట్టుముట్టారు. ఎమ్మెల్యేగా తమ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. ఈ నెలాఖరులోగా ఇల్లు ఖాళీ చేయాలని చెబుతున్నారని, ఇలా అయితే తాము ఎక్కడ నివశించాలని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. అదే సమయంలో ఎమ్మెల్యే మాట్లాడేందుకు ప్రయత్నించగా నిర్వాసితులు తమ డిమాండ్ల పరిష్కారం గురించి తప్ప ఏమీ వినమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నిర్వాసితుల సంఘం ప్రతినిధులు వేల్పుల చెన్నారెడ్డి, తుమ్మా వెంకటరెడ్డి, నల్లబోతుల కొండయ్య, బుర్రి వెంకటేశ్వర్లు, ఏనుగుల సురేష్, ఎమ్మార్పీఎస్ వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.


