మార్కాపురం: వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితుల ధర్నాలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి సోమయ్య మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం నడిచింది. సోమవారం కలెక్టరేట్ వద్ద ఆందోళన చేస్తున్న నిర్వాసితుల వద్దకు ఎమ్మెల్యే రాగా.. వారి న్యాయమైన సమస్యలను వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సోమయ్య డిమాండ్ చేశారు. దీంతో అసహనానికి గురైన ఎమ్మెల్యే కందుల.. ‘నీ చరిత్రంతా నాకు తెలుసు.. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావ్ఙ్ అంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై సోమయ్య అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. శ్రీనీ సంగతి కూడా నాకు పూర్తిగా తెలుసు.. నువ్వేం చేస్తున్నావో నాకు తెలియదనుకుంటున్నావా? పాతికేళ్లుగా ప్రజా సమస్యలపైనే పోరాడుతున్నా తప్ప ఎలాంటి ఆస్తులు కూడబెట్టుకోలేదు. నేను ఎక్కడా ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు. నా చరిత్ర ఏంటో ఇప్పుడే ఇక్కడే చెప్పు’ అంటూ ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు. ఇద్దరు నేతల మధ్య వాడివేడిగా వాగ్వాదం జరగడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. చివరకు అక్కడున్న నిర్వాసితులు జోక్యం చేసుకుని ఇద్దరికీ సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.
ఒంగోలు వన్‌టౌన్: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, సురక్షితమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎ. సత్యానంద్ అన్నారు. పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు సోమవారం ఉదయం ఒంగోలులోని దోనేపూడి రాఘవయ్య మున్సిపల్ హైస్కూల్‌లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా జడ్జి ముఖ్య అతిథిగా మాట్లాడారు. పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, చెట్లను పెంచడం, నీటిని పొదుపుగా వినియోగించడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వంటి చర్యల ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. సత్యానంద్, తాత్కాలిక జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీహెచ్. రామకృష్ణ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకట్రావు తదితరులు పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటి, వాటి సంరక్షణకు విద్యార్థులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల పాల్గొని పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): రాజమహేంద్రవరం జాతీయ వాణిజ్య వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్–నిర్కా) (సీటీఆర్‌ఐ) ద్వారా నాణ్యమైన వర్జీనియా పొగాకు విత్తనాలను 2026–27 సీజన్‌కు రైతులకు ఈనెల 13వ తేదీ నుంచి విక్రయిస్తారని ఆ సంస్థ డైరెక్టర్ డా.మాగంటి శేషుమాధవ్ ఓ ప్రకటనలో తెలిపారు. రాజమండ్రిలో నిర్కా (పూర్వపు సీటీఆర్‌ఐ), కందుకూరులో ఉదయం 10 గంటల నుంచి విక్రయిస్తారన్నారు. పొగాకు విత్తనాలు నిర్కా సీడ్ పోర్టల్ ద్వారా మాత్రమే విక్రయిస్తామన్నారు. విత్తనాల కొనుగోలు కోసం పొగాకు బోర్డు వారు జారీ చేసిన బ్యారన్ రిజిస్ట్రేషన్ పాస్‌బుక్ (టీబీజీఆర్.బుక్) తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. కిలో ఒక్కింటికి రూ.1300లకు విక్రయిస్తామన్నారు. విత్తన విక్రయాలు క్యాష్‌లెస్ లావాదేవీలు యూపీఐ (గూగుల్‌పే, ఫోన్‌పే), క్రెడిట్‌కార్డ్, డెబిట్‌కార్డ్ ద్వారా మాత్రమే అనుమతిస్తామన్నారు. పొగాకు బోర్డు ద్వారా రిజిస్టర్ చేయించిన కమర్షియల్ నారుమడులకు సంబంధించిన రైతులకు కిలో విత్తనానికి రూ.2200 చొప్పున విక్రయిస్తామన్నారు. ఇతరుల వద్ద లేదా దళారుల వద్ద విత్తనాలు కొనవద్దని సూచించామని నిర్కా డైరెక్టర్ డా.మాగంటి శేషుమాధవ్ తెలిపారు.


