ఒంగోలు టౌన్: ఢిల్లీ నడిబొడ్డున జరిగిన రైతాంగం ఉద్యమం, జంతర్ మంతర్‌లో జరిగిన విద్యార్థి పోరాటాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రజా ఉద్యమాలను నిర్మించినప్పుడే కేంద్రంలోని ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి గుణపాఠం చెప్పగలమని అఖిల భారత కిసాన్ సంఘ్ జాతీయ అధ్యక్షుడు రావుల వెంకయ్య స్పష్టం చేశారు. కార్పొరేట్ అనుకూల విధానాలు, రైతు వ్యతిరేక ఒప్పందాలు, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణలకు వ్యతిరేకంగా మరో క్విట్ ఇండియా తరహా ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరముందని చెప్పారు. మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపేంత వరకు పోరాటం కొనసాగాలని చెప్పారు. సంయుక్త కిసాన్ మోర్చా, కార్మిక సంఘాల పిలుపు మేరకు కలెక్టరేట్ వద్ద జైలు భరో కార్యక్రమంలో భాగంగా సోమవారం భారీ నిరసన చేపట్టారు. ఆందోళనకారులను అరెస్టు చేసి ఒన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కు తరలించి సొంత పూచికత్తు మీద వదిలిపెట్టారు. ఈ సందర్భంగా రావుల వెంకయ్య మాట్లాడుతూ...ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ల పేరుతో కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ ఒప్పందాలు చేసుకొని దేశ వ్యవసాయాన్ని కార్పొరేట్ల చేతిలో పెడుతుందని విమర్శించారు. కార్పొరేట్లకు లక్షల కోట్ల రుపాయణ రుణాలను మాఫీ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించమంటే నిరంకుశంగా వ్యవహరిస్తుందన్నారు. ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జజ్జురి జయంతిబాబు మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అమెరికాకు జూనియర్‌గా వ్యవరిస్తుందని వ్యాఖ్యానించారు. రూ.90 వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని తెచ్చిపెట్టే పొగాకు రైతుల సమస్యలను విస్మరించి తక్కువ ధరకు పొగాకు కొనుగోలు చేయడం దారుణమన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో పొగాకు రైతులు బ్యార్నీకి రూ.5 లక్షల వరకు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వాలకు రైతుల ఉసురు తగులుతుందన్నారు. కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ అన్నం పెట్టే రైతుల కడుపులు కొడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కంకణాల ఆంజనేయులు మాట్లాడుతూ నిధులు, పనిదినాలను తగ్గించి వేసి ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తి పెరగకుండా దేశం ఆర్థికంగా బలోపేతం కాదని స్పష్టం చేశారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జీవీ కొండారెడ్డి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కొత్తకోట వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విశాఖ ఉక్కుకు ముడి సరుకు ఇవ్వకుండా యరజర్ల, వలేటివారిపాలెం ప్రాంతాల్లో వేలాది ఎకరాల భూములను జిందాల్ కంపెనీకి అప్పగించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. నిరసన కార్యక్రమంలో సాగర్, ఎస్‌కే మాబు, కె.రమాదేవి, ఈదర అన్నపూర్ణ, పి.కల్పన, చీకటి శ్రీనివాసరావు, బాలకోటయ్య పాల్గొన్నారు.
విద్యార్థి, యువత, రైతులు, కార్మికులు ఐక్యపోరాటాలు చేయాలని పిలుపు
జైలు భరోలో పలువురు రైతు నాయకుల అరెస్టు


