ఒంగోలు టౌన్: రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకు తీవ్రతరం అవుతుందని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం మాటలతో కాలం వెల్లబుచ్చుతోందని డైఫీ రాష్ట్ర కార్యదర్శి జి. రామన్న విమర్శించారు. నగరంలోని ఎల్బీజీ భవనంలో డైఫీ జిల్లా 19వ మహాసభలు సోమవారం జరిగాయి. సభలకు డైఫీ జిల్లా నాయకులు కేవీ పిచ్చయ్య, పి.కిరణ్ అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ రాష్ట్రంలో వేలాది టీచర్ పోస్టులు, పోలీసు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. మిగిలిపోయిన టీచర్ ఉద్యోగాలకు డీఎస్సీ ప్రకటించాలని కోరారు. ఖాళీగా ఉన్న 20 వేల పోలీసు పోస్టులకు గాను కేవలం 6100 పోస్టులు మాత్రమే భర్తీ చేశారని, మిగిలిన 14 వేల పోస్టులను కూడా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఇచ్చిన హామీని నిలిబెట్టుకోవాలన్నారు. పరిశ్రమల ఏర్పాటు ప్రకటనలకే పరిమితమవుతున్నాయని, కొత్త పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. డైఫీ జిల్లా కార్యదర్శి కేఎఫ్ బాబు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఉన్న యూనివర్శిటీ అభివృద్ధిని పాలకులు పట్టించుకోవడం లేదని, దీంతో యూనివర్శిటీ ఏర్పడినప్పుటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని తెలిపారు. ట్రిపుల్ ఐటీకి సొంత భవనాలు నిర్మించకుండా విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటం అడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీజీహెచ్‌లో ఓపీ కౌంటర్లు పెంచాలని, డ్యూటీ డాక్టర్లను, నర్సింగ్ స్టాఫ్‌ను , పారిశుధ్య కార్మికులను పెంచాలని డిమాండ్ చేశారు.
15 మందితో నూతన కమిటి ఎంపిక...
డైఫీ జిల్లా నూతన కమిటీ ఎంపిక జరిగింది. కార్యదర్శిగా కేఎఫ్ బాబు, అధ్యక్షునిగా కేవీ పిచ్చయ్య, ఉపాధ్యక్షులుగా కిరణ్, సహాయ కార్యదర్శిగా యు.కిరణ్, కమిటి సభ్యులుగా మోహన్, రాము, ప్రేమ్ కుమార్, బాలాజీ, దానియేలు, మల్లికార్జునలతో సహా మొత్తం 15 మందితో కమిటీ ఏర్పాటైంది. సభలో జీవి కొండారెడ్డి, కంకణాల రమాదేవి, వీరాస్వామి మాట్లాడారు. అనంతరం ఒంగోలు వాన్‌పిక్, దొనకొండ, చీమకుర్తి శిల్పారామం పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయాలని, కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వాలని తీర్మాణాలు చేశారు.
టంగుటూరు: దళిత వీఆర్‌ఏపై డిప్యూటీ తహసీల్దార్ శ్రీనాథ్ గత నెల 26వ తేదీన మద్యం మత్తులో దాడి చేశాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి చర్యలు లేకపోవడంతో బాధితుడు సోమవారం సోషల్ మీడియాలో మద్యం మత్తులో డీటీ మాట్లాడిన మాటల వీడియోలను వైరల్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుడి కథనం మేరకు.. టంగుటూరు అంబేడ్కర్ నగర్‌లో ఉన్న వీఆర్‌ఏ కారుమంచి తేజ ఇంటికి 26వ తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో డిప్యూటీ తహసీల్దార్ శ్రీనాథ్ మద్యం తాగిన మత్తులో వచ్చి సంబంధం లేని విషయాల్లో తిడుతూ అతనిపై దాడి చేసి మొబైల్ ఫోన్ లాక్కున్నాడు. ఏవేవో చెక్ చేసి ఏమీ లేవు ‘మాల నా..కొ.. చంపేస్తాను’ అంటూ కులం పేరుతో తిడుతూ గొంతు పట్టుకొని పిసుకుతూ గోడకేసి కొట్టాడు. అయితే అదే రోజున టంగుటూరు ఎస్సైకి ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదు. బాధితుడు భయంతో ఆగస్టు 3వ తేదీ సోమవారం ఒంగోలు కలెక్టర్ స్పందనలో తన గోడు వెళ్లబోసుకుని న్యాయం చేయమని అర్జీ ఇచ్చారు. నేరం చేసిన వారికి అనుకూలంగా కేసును నీరుగాస్తూ బాధితుడిని బెదిరిస్తుండటంతో గత్యంతరం లేక సోషల్ మీడియాలో డీటీ మాట్లాడిన వీడియోలు పెట్టినట్లు తెలుస్తోంది.


