అద్దంకి(సంతమాగులూరు):
అద్దంకి నియోజకవర్గంలో రోజుకో చోట ‘మట్టి’ దుమారం రేగుతోంది. స్థానిక ముఖ్య నేత ఆశీస్సులతో పసుపు దండు అక్రమ దందా యథేచ్ఛగా సాగుతోంది. సంతమాగులూరు మండలంలోని కొమ్మాలపాడు చెరువు టీడీపీ సానుభూతిపరుల అక్రమ తవ్వకాలతో గుల్లవుతోంది. నిబంధనలను తుంగలో తొక్కి భారీ పొక్లెయిన్లు, టిప్పర్లతో అడ్డగోలుగా మట్టిని తోడేస్తున్నా అధికారులు కన్నెత్తి చూడటం లేదు. రూ.లక్షల్లో దోపిడీ..
ఈ చెరువు నుంచి రోజూ 400 నుంచి 500 ట్రక్కుల మట్టిని తవ్వి రియల్ ఎస్టేట్ వెంచర్లకు, ప్రైవేటు ఇళ్ల స్థలాల మెరక కోసం తరలిస్తున్నారు. ట్రక్కుకు రూ.400 వంతున వసూలు చేస్తుండటంతో.. రోజుకు సుమారు రూ.2 లక్షలకు పైగా అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తోంది. ఈ లెక్కన నెలకు దాదాపు రూ.60 లక్షల మేర మట్టి దోపిడీ సాగుతోంది.
పట్టించుకోని అధికారులు..
చిన్నపాటి తప్పు జరిగితేనే పరుగులు తీసే రెవెన్యూ, మైనింగ్ అధికారులు.. ఇంత భారీ స్థాయిలో యంత్రాలతో మట్టిని లూటీ చేస్తున్నా పట్టిపట్టనట్లు వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బడా నేతల అండదండలతోనే ఈ అక్రమ దందా సాగుతోందన్న ఆరోపణలున్నాయి. కూటమిలో భాగస్వామి అయిన జనసేన నాయకులు సైతం ఈ మట్టి దోపిడీ వెనుక ఎవరున్నారంటూ బహిరంగంగానే ప్రశ్నిస్తుండటం గమనార్హం. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి టీడీపీ నేతల అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
టీడీపీ నేతల మట్టి తవ్వకాలతో
కొమ్మాలపాడు చెరువు గుల్ల
రియల్ ఎస్టేట్ వెంచర్లకు మట్టి తరలిస్తూ రోజుకు రూ.2 లక్షల దోపిడీ
చెరువులో పొక్లెయిన్లు, టిప్పర్లు కవాతు చేస్తున్నా కదలని అధికారులు


