కబ్జా ఆపండి
కళ్లు తెరవండి..
ఒంగోలు టౌన్:
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కొనుగోలు చేసిన అగ్రహారం, వెంగముక్కల పాలెం భూములు ఆక్రమణలకు గురవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సీపీఎం నగర కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఎం నగర కమిటీ నాయకులు గురువారం భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా చీకటి శ్రీనివాసరావు మాట్లాడుతూ అగ్రహారం, వెంగముక్కలపాలెం ప్రాంతాల రైతుల వద్ద నుంచి భూములను కొనుగోలు చేసి లేఔట్లు వేసి 20,800 మంది పట్టాలు రెడీ చేశారన్నారు. కానీ ఎన్నికల కోడ్ రావడంతో నాటి ప్రభుత్వం లబ్ధిదారులకు హామీ పత్రాలను ఇచ్చిందన్నారు. కానీ బాబు సర్కార్ అధికారంలోకి వచ్చి 19 నెలలవుతున్నా ఆ స్థలాల గురించి గానీ పేదల గురించి పట్టించుకోకుండా తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వస్తే ఒక్కొక్కరికి రెండు సెంట్ల ప్రకారం పంపిణి చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఒక్కరికీ స్థలం మంజూరు చేయలేదని పండిపడ్డారు. చంద్రబాబు అఽధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోమాట చెబుతూ ప్రజలను మాయ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజల జీవితాలతో పాలకులు ఆటలాడుకుంటున్నారని మండిపడ్డారు. వెంగముక్కలపాలెంలోని సర్వే నంబర్ 170, 171,172లో సుమారు 170 ఎకరాల భూమిని 8 వేల లబ్ధిదారులకు కేటాయించారని, నేటికీ కూడా వాటిని స్వాధీనం చేయకపోవడంతో కొందరు రైతులు హద్దు రాళ్లను తొలగించి భూమిలో పొగాకు సాగు వేసినట్లు తెలిపారు. ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన అధికారులు చోద్యం చూడడం బాధాకరమన్నారు. అఽధికారులు తగిన చర్యలు తీసుకోవాలని, వెంటనే నిరుపేదలకు ఇవ్వాల్సిన స్థలాన్ని వారికి స్వాధీనం చేయాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు భూముల చుట్టూ ప్రహరీ నిర్మించి కబ్జా కాకుండా కాపాడాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు తంబి శ్రీనివాసరావు, ఎస్డీ హుసేన్, బి.వెంకటేశ్వరరావు, భావనారాయణ పాల్గొన్నారు.
భూములు ఆక్రమిస్తున్నా పట్టించుకోరా..?
ఇళ్ల స్థలాల భూములు పరిశీలించిన
సీపీఎం నేతలు


