రెండు జిల్లాల్లోనూ గణతంత్ర దిన వేడుకలు
● ప్రకాశం, మార్కాపురం జిల్లాల అధికారులతో సమీక్షించిన కలెక్టర్ రాజాబాబు
ఒంగోలు సబర్బన్: ప్రకాశం జిల్లాతో పాటు నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లా కేంద్రంలోనూ దేశభక్తి ఉట్టిపడేలా 77వ భారత గణతంత్ర దిన వేడుకలను ఘనంగా నిర్వహించేలా విస్తృత ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ పి.రాజాబాబు సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం ఒంగోలు కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఎస్పీ వి.హర్షవర్థన్‌రాజు, జేసీ ఆర్.గోపాలకృష్ణతో కలిసి రెండు జిల్లాల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ నెల 26వ తేదీ గణతంత్ర దినోత్సవానికి సన్నాహక ఏర్పాట్లపై శాఖల వారీగా సమీక్షించారు. అవసరమైన సలహాలు, సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో ఏర్పాటు చేసే విధంగానే నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లా కేంద్రమైన మార్కాపురంలో కూడా ఈ నెల 26వ తేదీ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేలా పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలన్నారు. వేడుకల ప్రాంగణంలో పారిశుధ్య నిర్వహణ, తాగునీటి వసతి, తాత్కాలిక మరుగుదొడ్లు, సీటింగ్, బారికేడింగ్, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై సమీక్షించారు. అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఏర్పాట్ల విషయంలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా విజయంతంగా వేడుకలు నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఆకట్టుకునేలా స్టాల్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రెండు జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. పోలీస్ శాఖ తరఫున తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. సమావేశంలో డీఆర్వో ఓబులేసు, ఒంగోలు, కనిగిరి, మార్కాపురం ఆర్డీఓలు ప్రసన్నలక్ష్మి, కేశవర్దన్‌రెడ్డి, శివరామిరెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శ్రీధర్‌రెడ్డి, జాన్సన్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


