వలస కార్మికుల సమాచారం సేకరించండి
నూతన చట్టాలపై అవగాహన పెంపొందించుకోండి విలీన పోలీస్ స్టేషన్ల అధికారులకు ఎస్పీ హర్షవర్థన్‌రాజు ఆదేశం
ఒంగోలు టౌన్: వలస కార్మికుల వివరాలను ఎప్పటికప్పుడు సేకరించాలని, గ్రామ, వార్డు మ్యాపింగ్‌ను పూర్తి సమాచారంతో సిద్ధం చేసి ఉంచుకోవాలని ఎస్పీ హర్షవర్థన్ రాజు ఆదేశించారు. ప్రకాశం జిల్లాలో విలీనమైన పోలీసు స్టేషన్ల అధికారులతో గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలోని గెలాక్సీ కాంప్లెక్స్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని పోలీసు స్టేషన్ల పరిధిలోని సీసీ కెమెరాల స్థానాలను, దిశలను మార్చాలని చెప్పారు. కవరేజీ పరిధిని విస్తరించేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కొత్త చట్టాల అమలులో నిర్లక్ష్యంగా ఉండవద్దని స్పష్టం చేశారు. రికార్డులను సమయానుకూలంగా, కచ్చితంగా నిర్వహించాలని, ప్రాపర్టీ, ప్రభుత్వ రిజిస్టర్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని చెప్పారు. రికార్డులన్నింటిని క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ సిస్టిమ్స్ పోర్టల్ (సీసీటీఎన్‌ఎస్)లో పొందుపరచాలన్నారు. ప్రాథమిక విచారణ రికార్డుల విషయంలో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలని చెప్పారు. జీరో ఎఫ్‌ఐఆర్, ఇన్వస్టిగేషన్ రిజిస్టర్, ఈ కంప్లైంట్ విధానాలను సమర్థవంతంగా అమలు చేయాలని చెప్పారు. అఽధికార పరిధితో సంబంధం లేకుండా నమోదు చేసే జీరో ఎఫ్‌ఐఆర్ కాపీతో పాటు దర్యాప్తు పురోగతి వివరాలు, ఈ–సమన్స్ పంపే ప్రక్రియ, నేర దృశ్యాల వీడియో రికార్డింగ్, ఈ–సాక్ష్యం వంటి డిజిటల్ విధానాలకు సంబంధించిన రిజిస్టర్లను కొత్త ఫార్మెట్ ప్రకారం నిర్వహించాలని వివరించారు. నేరాల దర్యాప్తు వేగవంతం చేయడం, మహిళలు, చిన్నారులపై జరిగిన నేరాల దర్యాప్తును నిర్ణీత సమయంలో పూర్తి చేయడం చాలా ముఖ్యమని ఎస్పీ తెలిపారు. వీటికి సంబంధించిన రికార్డులు పక్కాగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో కందుకూరు డీఎస్పీ సీహెచ్‌వీ బాలసుబ్రహ్మణ్యం, డీసీఆర్బీ ఇన్‌స్పెక్టర్ దేవ ప్రభాకర్, ఎస్బీ సీఐ శ్రీనివాసరావు, ఐటీ కోర్ సీఐ వెంకటేశ్వర్లు, పీసీఆర్ సీఐ దుర్గా ప్రసాద్, కందుకూరు సీఐ షేక్ అన్వర్ బాషా, గుడ్లూరు సీఐ జి.మంగారావు, అద్దంకి సీఐలు మల్లికార్జునరావు, సుబ్బరాజు, సంతమాగులూరు సీఐ కె.వెంకటరావు, ఎస్‌హెచ్‌ఓలు, రైటర్లు, అసిస్టెంట్ రైటర్లు, టెక్నికల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ హర్షవర్థన్‌రాజు
పాల్గొన్న విలీన పోలీసు స్టేషన్ల అధికారులు
వలస కార్మికుల సమాచారం సేకరించండి


