ఖోఖో అడ్డాగా కనిగిరి గడ్డ
జాతీయ స్థాయి ఖోఖో పోటీలకునలుగురు కనిగిరి విద్యార్థినులు తెలంగాణలో ఈ నెల 11 నుంచి 15 వరకు 58వ జాతీయ స్థాయి ఖోఖో పోటీలు
కనిగిరి రూరల్: ఖోఖో పోటీల్లో కనిగిరి విద్యార్థినులు సత్తా చాటుతున్నారు. ఏకంగా జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై కనిగిరి పేరును చాటిచెబుతున్నారు. ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు తెలంగాణలోని ఖాజీపేటలో నిర్వహించనున్న 58వ జాతీయ స్థాయి ఖోఖో పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ మహిళా ఖోఖో జట్టుకు మొత్తం 15 మంది ఎంపికయ్యారు. వారిలో ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి కనిగిరికి చెందిన నలుగురు విద్యార్థినులు ఉన్నారు. డి.శివనాగలక్ష్మి, ఎస్.పావని, ఎం.సఖియా, జి.భవాని ఎంపికయ్యారు. వీరు గత నెల 24 నుంచి 26వ తేదీ వరకు కృష్ణా జిల్లా గుడివాడలోని ఎన్జీఆర్ స్టేడియంలో నిర్వహంచిన 58వ రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లా జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. వరుసగా మూడు సార్లు విజేతలుగా నిలిచారు. ఈ టీంలోని ఖోఖో క్రీడాకారులంతా కనిగిరి ఖోఖో అకాడమీకి చెందిన వారే కావడం గమనార్హం. జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికై న నలుగురు విద్యార్థినులు వారం రోజుల నుంచి కాకినాడ ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో జరుగుతున్న రాష్ట్ర జట్టు శిక్షణ తరగతుల్లో ఉన్నారు. క్రీడాకారులను ఖోఖో కోచ్ బీ కాశీవిశ్వనాథరెడ్డి, ఖోఖో సంఘ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం.సీతారాంరెడ్డి, ఖోఖో సంఘ రాష్ట్ర కార్యదర్శి కే హనుమంతరావు, ఎంఎన్‌ఎం కళాశాల కరస్పాండెంట్ ఏలూరి సుబ్బారావు అభినందించారు.
అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్
సాధించాలన్నదే లక్ష్యం : డి.శివనాగలక్ష్మి
జాతీయ, రాష్ట్ర, జిల్లా, యూనివర్శిటీ స్థాయి ఖోఖో పోటీల్లో పాల్గొన్న డి.శివనాగలక్ష్మి అనేక అవార్డులు, ప్రశంసలు పొందింది. బెస్ట్ చేజర్, బెస్ట్ రన్నర్, బెస్ట్ ఆల్ రౌండర్‌గా ప్రతిభ కనబరుస్తోంది. జాతీయ స్థాయిలో అండర్ 17 విభాగంలో 2019లో ఉత్తర ప్రదేశ్‌లోని అలిగ్రాలో, 2020లో రాజస్థాన్‌లోని జైపూర్‌లో, 2021లో జాతీయ స్థాయి జూనియర్స్ విభాగంలో ఒడిశాలో, 55వ సీనియర్స్ విభాగంలో మహారాష్ట్రలో, 2023లో 56వ సీనియర్స్ విభాగంలో న్యూఢిల్లీలో, 2024లో 57వ సీనియర్స్ విభాగంలో ఒడిశా (పూరిలో)లో నిర్వహించిన ఖోఖో పోటీల్లో పాల్గొంది. రాష్ట్ర స్థాయిలో అండర్ 14లో రెండు సార్లు, అండర్ 17లో మూడు సార్లు, సబ్ జూనియర్ విభాగంలో రెండు సార్లు, సీనియర్స్ విభాగంలో 5 సార్లు, యూనివర్శిటీ స్థాయిలో 2 సార్లు ఆడింది. యూనివర్శిటీ స్థాయిలో 2021లో కర్ణాటకలో, 2022లో కేరళలో జరిగిన ఖోఖో పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటింది. బెస్ట్ ప్లేయర్‌గా 55వ, 56వ, 57వ, 58వ సీనియర్స్ విభాగంలో అవార్డులు సాధించింది. త్వరలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో కూడా ఏపీ జట్టును విజేతగా నిలుపుతామనే ధీమా వ్యక్తం చేసింది. అంతర్జాతీయ స్థాయి ఖోఖో క్రీడల్లో ఆడి గోల్డ్ మెడల్ సాధించి ప్రభుత్వ ఉద్యోగం పొందాలన్నదే లక్ష్యమని శివనాగలక్ష్మి తెలిపింది. కనిగిరిలో బీపీఈడీ సెకండియర్ చదువుతోంది.
పీఈటీ కావాలన్నదే లక్ష్యం : ఎం.సఖియ
ఖోఖో క్రీడల్లో బెస్ట్ రన్నర్‌గా అనేకసార్లు ప్రశంసలు, అవార్డులు సాధించింది. జాతీయ, రాష్ట్ర, యూనివర్శిటీ స్థాయి ఖోఖో క్రీడల్లో ప్రతిభ కనబరిచింది. సబ్ జూనియర్స్ (జార్ఖండ్‌లోని రాంచీ)లో, అండర్ 14 నేషనల్స్ (మహారాష్ట్రలోని పూనే)లో జానియర్స్ నేషనల్స్ (వెస్ట్ బెంగాల్)లో, ఖేలో ఇండియా (తమిళనాడు)లో, జూనియర్స్ నేషనల్స్ (చత్తీస్‌ఘడ్)లో, అండర్ 19 నేషనల్స్ (మహారాష్ట్ర)లో, యూనివర్శిటీ నేషనల్స్ (కేరళ)లో పాల్గొంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ప్రభుత్వ పీఈటీ ఉద్యోగం పొందాలన్నదే లక్ష్యంగా తెలిపింది. ప్రస్తుతం కనిగిరిలో డిగ్రీ సెకండియర్ చదువుతోంది.
ఖోఖో అడ్డాగా కనిగిరి గడ్డ
ఖోఖో అడ్డాగా కనిగిరి గడ్డ
ఖోఖో అడ్డాగా కనిగిరి గడ్డ


