రంగుల సోయగం.. సంక్రాంతి సంబరం
ఒంగోలు టౌన్: ఖాకీల కవాతు, బూట్ల చప్పుళ్లతో గంభీరమైన వాతవరణం ఉండే పోలీస్ పరేడ్ గ్రౌండ్.. శుక్రవారం రంగురంగుల ముగ్గులతో సింగారించుకున్న సీతాకోకచిలుకలా దర్శనమిచ్చింది. ముందస్తు సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి తరలివచ్చిన పోలీసుల కుటుంబ సభ్యులతో కళకళలాడింది. గంగిరెద్దుల విన్యాసాలు, పొట్టేళ్ల ప్రదర్శన, నింగినంటిన గాలిపటాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. మ్యూజికల్ చైర్, లెమన్ స్పూన్, పెయింటింగ్ పోటీల్లో మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎస్పీ హర్షవర్థన్‌రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలను ఆయన సతీమణి శృతి దండు ప్రారంభించారు. కలెక్టర్ సతీమణి పి.సుజాత, పీటీసీ ప్రిన్సిపాల్ రాధిక, దామచర్ల నాగసత్యలత హాజరయ్యారు. రంగవల్లుల పోటీల్లో 100 మందికి పైగా మహిళలు పాల్గొనగా ప్రతిభ కనబరిచిన ఐదుగురిని విజేతలుగా ఎంపిక చేశారు. ఏఆర్ ఎస్సై నాగేశ్వరరావు సతీమణి సీహెచ్ కళ్యాణి ప్రథమ బహుమతి, ఉలవపాడు పోలీసు స్టేషన్ మహిళా కానిస్టేబుల్ బి.సాహిత్య ద్వితీయ బహుమతి, ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ రంగారెడ్డి సతీమణి బి.నాగలక్ష్మి తృతీయ బహుమతి, ఏఆర్ పీసీ రోశయ్య సతీమణి టి.నాగవేణి, దొనకొండ పోలీసు స్టేషన్ మహిళా కానిస్టేబుల్ షేక్ షన్ను వరసగా 4, 5 బహుమతులు సాధించారు. మ్యూజికల్ చైర్స్, లెమన్ స్పూన్, పెయింటింగ్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు, ఆర్‌ఐ రమణారెడ్డి, ఎస్సైలు, ఏఆర్ ఎస్సైలు పాల్గొన్నారు.
పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఉత్సాహంగా ముందస్తు సంక్రాంతి వేడుక
రంగవల్లులు, ఆటల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న పోలీసు కుటుంబాలు
కలెక్టర్ సతీమణి సుజాత, ఎస్పీ సతీమణి శృతి, పీటీసీ ప్రిన్సిపాల్ రాధిక చేతుల మీదుగా బహుమతి ప్రదానం
రంగుల సోయగం.. సంక్రాంతి సంబరం


