మేధావుల పుట్టినిల్లు.. పీవీఆర్‌ హైస్కూల్‌ | - | Sakshi
Sakshi News home page

మేధావుల పుట్టినిల్లు.. పీవీఆర్‌ హైస్కూల్‌

Jan 10 2026 9:34 AM | Updated on Jan 10 2026 9:34 AM

మేధావ

మేధావుల పుట్టినిల్లు.. పీవీఆర్‌ హైస్కూల్‌

ఏర్పాట్ల గురించి కనీసం పట్టించుకోని నగరపాలక సంస్థ...

ఒంగోలు సిటీ:

పీవీఆర్‌ మున్సిపల్‌ హైస్కూల్‌.. ఒంగోలులోని ఈ హైస్కూల్‌ గురించి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. వందేళ్ల క్రితం నిర్మించబడి దశల వారీగా అభివృద్ధి చేయబడిన పీవీఆర్‌ హైస్కూల్‌ ఒంగోలు నగరానికే తలమానికంగా నిలుస్తోంది. ఇక్కడ విద్యాభ్యాసం చేసిన వారిలో ఎంతో మంది వివిధ రంగాల్లో ప్రముఖులుగా రాణిస్తున్నారు. లక్షల మంది విద్యాభ్యాసం చేశారు. నేటికీ విజయవంతంగా నడుస్తున్న పీవీఆర్‌ హైస్కూల్‌.. మేధావుల పుట్టినిల్లుగా పేరొందింది. సాధారణంగా అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని అంటారు. కానీ, విద్యా దానం ఇంకా గొప్పదని చాటిచెప్పేందుకు నిలువెత్తు నిదర్శనంగా పీవీఆర్‌ హైస్కూల్‌ నిలుస్తోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పీవీఆర్‌ పాఠశాలకు ఉన్నంత పేరు మరో పాఠశాలకు లేదంటేనే.. పీవీఆర్‌ హైస్కూల్‌ గొప్పతనం ఏంటో అర్థం చేసుకోవచ్చు. స్వాతంత్య్రానికి ముందు ఏర్పాటైన ఈ పాఠశాల దినదినాభివృద్ధి చెందుతూ నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన ఎంతోమందిని ఉన్నతంగా తీర్చిదిద్దింది. అలాంటి పీవీఆర్‌ హైస్కూల్‌ శతాబ్ది ఉత్సవాలకు ముస్తాబైంది. నేడు, రేపు పీవీఆర్‌ బాలుర హైస్కూల్లో ఘనంగా శతాబ్ది ఉత్సవాలు జరగనున్నాయి. భారీగా పూర్వ విద్యార్థులు తరలిరానున్నారు.

పాఠశాల చరిత్ర...

కరవది జమిందారు భరద్వాజసగోత్రీకుడైన పిశుపాటి బంగారుభొట్లు, వెంకట లక్ష్మమ్మ కుమారుడు పిశుపాటి వెంకట రంగయ్య 1871వ సంవత్సరంలో జన్మించారు. ఈయనకు సుందరమ్మతో వివాహమైంది. వీరికి ముగ్గురు కుమారులు కాగా, ప్రథమ సంతానం బంగారుభొట్లు, ద్వితీయ కుమారుడు వెంకట్రాయశర్మ, కనిష్ట కుమారుడు లక్ష్మీనారాయణ. రెండో కుమారుడు అయిన వెంకట్రాయశర్మ 1892లో జన్మించారు. ఈయన కరవది గ్రామంలోని వేణుగోపాలస్వామి, సీతారామస్వామి, రామలింగేశ్వరస్వామి దేవస్థానానికి వంశపారంపర్య ధర్మకర్తగా ఉండి దేవాలయ నిర్వహణకు సుక్షేత్రమైన 50 ఎకరాల పంట భూమిని 16–1–1922 తేదీన దానం చేశారు. వెంకట రంగయ్య బ్రిటీషు పరిపాలన కాలంలో నెల్లూరు జిల్లా బోర్డు మెంబరుగా పనిచేశారు. ఈయన 1898లో తన పేరు మీద ఒంగోలులో ఎలిమెంటరీ పాఠశాల ప్రారంభించారు. ఆ తర్వాత దానిని పిశుపాటి వెంకట రంగయ్య హిందూ మిడిల్‌ స్కూల్‌గా అభివృద్ధి చేసి పాఠశాలకు సొంత భవనాన్ని నిర్మించి ప్రారంభించారు. 27–1–1922 తేదీన తన 51వ ఏట ఆయన మరణించడంతో ఆయన ద్వితీయ పుత్రుడు వెంకట్రాయశర్మ పాఠశాల నిర్వహణ బాధ్యతలు చేపట్టి పాఠశాల భవన నిర్మాణాన్ని పూర్తి చేయించి 1925వ సంవత్సరంలో పిశుపాటి వెంకట రంగయ్య హిందూ మిడిల్‌ స్కూల్‌గా నూతన భవనంలోకి మార్చారు. దివంగత నర్శింగోలు జనార్దనరావు ప్రధానోపాధ్యాయునిగా పనిచేసి పాఠశాలను అభివృద్ధిలోకి తెచ్చారు. 1950లో డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఇన్‌స్ట్రక్షన్స్‌, గుంటూరు వారి ఉత్తర్వుల ప్రకారం అప్పటి మున్సిపల్‌ చైర్మన్‌ దివంగత దారా గోపాలశాస్త్రి ఆధ్వర్యంలో ఒంగోలు మున్సిపాలిటీలో పిశుపాటి వెంకట రంగయ్య (పీవీఆర్‌) స్కూల్‌ వీలీనమైంది. అప్పటి నుంచి పిశుపాటి వెంకట రంగయ్య (పీవీఆర్‌) మున్సిపల్‌ స్కూల్‌గా పిలవబడుతోంది. 1950 వరకు 8వ తరగతి వరకు మాత్రమే ఉంది. 1951–52 విద్యా సంవత్సరంలో 9వ తరగతి ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఎస్‌ఎస్‌ఎల్‌సీ ప్రథమ సంవత్సర మొదటి బ్యాచ్‌ని మార్చి 1954లో దివంగత నర్సింగోలు జనార్దనరావు ఆధ్వర్యంలో ప్రారంభించి పబ్లిక్‌ పరీక్షలు రాయించారు. అనంతరం 1989లో పీవీఆర్‌ పాఠశాలను బాలురు, బాలికల పాఠశాలలుగా విభజించి విద్యాబోధన చేస్తున్నారు.

పూర్వ విద్యార్థుల్లో ఎందరో ప్రముఖులు...

పీవీఆర్‌ హైస్కూల్లో చదివిన అనేక మంది నేడు దేశ, విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. జిల్లాలో, రాష్ట్రంలో వివిధ రంగాల్లో ఎంతో మంది ప్రముఖులుగా రాణిస్తున్నారు. మాజీ డీజీపీ నండూరి సాంబశివరావు పీవీఆర్‌ పూర్వ విద్యార్థి. నేటి శతాబ్ది ఉత్సవాల సభకు ఈయనే అధ్యక్షత వహించనున్నారు. విశ్రాంత డీఐజీ తోట వెంకట్రావు, విశ్రాంత ఐజీ బత్తిన శ్రీనివాసులు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత వాసిరాజు ప్రకాశం, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత షేక్‌ సలీం, నాటక, సినీ రచయిత మరుధూరి రాజా, తదితర ప్రముఖులంతా పీవీఆర్‌ పూర్వ విద్యార్థులే. వీరంతా శతాబ్ది ఉత్సవాల్లో ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరుకానున్నారు. వీరితో పాటు పీవీఆర్‌ పూర్వ విద్యార్థులైన ఎందరో మేధావులు, వందలాది మంది పూర్వ విద్యార్థులు శతాబ్ది ఉత్సవాలకు తరలిరానున్నారు.

1925లో పిశుపాటి వెంకట రంగయ్య (పీవీఆర్‌) పేరుతో పాఠశాల ఏర్పాటు

వందేళ్లుగా ఎందరో మేధావులను

తీర్చిదిద్దిన పాఠశాల

నేటి నుంచి శతాబ్ది వేడుకలు

భారీగా తరలిరానున్న పూర్వ విద్యార్థులు

ఎంతో ప్రసిద్ది చెందిన పీవీఆర్‌ మున్సిపల్‌ ఉన్నత పాఠశాల శతాబ్ది ఉత్సవాలను పూర్వ విద్యార్థులంతా కలిసి నేడు, రేపు అట్టహాసంగా నిర్వహించేందుకు శ్రీకారం చుట్టగా, ఒంగోలు నగరపాలక సంస్థ అధికారులు, పాలకులు ఏర్పాట్ల గురించి కనీసం పట్టించుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఉత్సవాలు నిర్వహించనున్నట్లు కొన్ని నెలల క్రితమే ప్రకటించినప్పటికీ పెయింటింగ్‌కు కొద్ది రోజుల క్రితమే టెండర్లు ఖరారు చేసి కేవలం మూడు రోజులు ముందుగా పనులు చేపట్టడంతో అరకొరగా జరిగాయి. అసంపూర్తిగా పెయింటింగ్‌ వేయడంతో పాటు వేడుకలు నిర్వహించనున్న పీవీఆర్‌ బాలుర హైస్కూల్‌ గ్రౌండ్‌ను శుక్రవారం వరకూ కూడా పరిశుభ్రం చేయించలేదు. మరుగుదొడ్లు సైతం అధ్వానంగా ఉన్నట్లు పూర్వ విద్యార్థులు తెలిపారు. దీంతో పూర్వ విద్యార్థులే సొంత నిధులతో వేడుకలకు అత్యవసరమైన కొన్ని పనులు చేయించుకున్నారు. ఎంతో పేరున్న పీవీఆర్‌ హైస్కూల్‌ శతాబ్ది ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తుండగా, యాజమాన్యమైన నగర పాలక సంస్థ తగిన ఏర్పాట్లు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై పూర్వ విద్యార్థులు, ఉత్సవాల కమిటీ ప్రతినిధులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మేధావుల పుట్టినిల్లు.. పీవీఆర్‌ హైస్కూల్‌ 1
1/2

మేధావుల పుట్టినిల్లు.. పీవీఆర్‌ హైస్కూల్‌

మేధావుల పుట్టినిల్లు.. పీవీఆర్‌ హైస్కూల్‌ 2
2/2

మేధావుల పుట్టినిల్లు.. పీవీఆర్‌ హైస్కూల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement