రెవెన్యూ సమస్యలపై దృష్టి సారించండి
ఒంగోలు సబర్బన్: క్షేత్ర స్థాయిలో రెవెన్యూ సమస్యల పరిష్కారంపై అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ పి.రాజాబాబు ఆదేశించారు. శుక్రవారం ఒంగోలులోని కలెక్టరేట్‌లో ప్రకాశం, మార్కాపురం జిల్లాల రెవెన్యూ అధికారులతో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల సంబంధిత అంశాలపై జేసీ గోపాలకృష్ణతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జాయింట్ కలెక్టర్ వద్ద ఉన్న అధికారాలను డీఆర్‌ఓలకు, డివిజన్ లెవెల్ ఆఫీసర్ల వద్ద ఉన్న అధికారాలను తహసీల్దార్లకు ప్రభుత్వం బదలాయించిందన్నారు. ప్రజా ప్రయోజనం కోసం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయ ఫలాలు క్షేత్రస్థాయిలో నిష్పక్షపాతంగా కనిపించాలన్నారు. భూముల మ్యుటేషన్, ఆన్‌లైన్, సర్వే తదితర అంశాలపై మండలాల వారీగా సమీక్షిస్తానని తెలిపారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రభుత్వ భూములను కాపాడే బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉందన్నారు. ఇకపై ప్రతినెలా రెవెన్యూ కాన్ఫరెన్స్ నిర్వహిస్తానని తెలిపారు. ఫైళ్లన్నీ ఆన్‌లైన్‌లోనే పంపించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. తహసీల్దార్లు అందరూ టూర్ డైరీ రిపోర్టులు పంపించాలని ఆదేశించారు. మండల స్థాయి అధికారుల పనితీరును డివిజన్ స్థాయిలో ఆర్డీవోలు, సబ్ కలెక్టర్ నిరంతరం గమనిస్తూ ఉండాలని కలెక్టర్ చెప్పారు. 22(ఏ) భూముల జాబితాలో చేర్పులు, తొలగింపుల కోసం ప్రభుత్వం నిర్దేశించిన నియమాలను కచ్చితంగా పాటించాలన్నారు. సబ్ డివిజన్ చేయడం, రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో పాటించాల్సిన ప్రక్రియపైనా అధికారులకు అవగాహన కల్పించారు. ఈనెల 11వ తేదీలోగా పట్టాదారు పాస్ పుస్తకాలన్నీ పూర్తిస్థాయిలో పంపిణీ చేయాలని ఆదేశించారు. సమీక్షలో డీఆర్‌ఓ బి.చినఓబులేసు, కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీ, ఒంగోలు, అద్దంకి ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, కనిగిరి ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి, మార్కాపురం ఇన్చార్జి సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు, సర్వే శాఖ సహాయ సంచాలకులు గౌస్ బాషా, దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ పానకాలరావు, సబ్ రిజిస్ట్రారులు, తహసీల్దార్లు, డీటీలు, మండల సర్వేయర్లు, దేవదాయ శాఖ ఈవోలు పాల్గొన్నారు.అనంతరం మార్కాపురం జిల్లాకు ఇన్‌చార్జిలుగా ఉన్న కలెక్టర్, జేసీ, డీఆర్‌ఓతోపాటు ఆర్డీఓలు, ఇన్‌చార్జి సబ్ కలెక్టర్లను ఏపీ రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ప్రతినిధులు సత్కరించారు.
రైతులకు 11 లోగా పట్టాదారు
పాస్‌పుస్తకాలు పంచాలి
ప్రకాశం, మార్కాపురం జిల్లా అధికారుల సమీక్షలో కలెక్టర్ రాజాబాబు


