
సాక్షి చీరాల విలేకరి మురళి కన్నుమూత
చీరాల అర్బన్: సాక్షి దినపత్రిక బాపట్ల జిల్లా చీరాల విలేకరి కడియం మురళి (51) శుక్రవారం ఉదయం మృతిచెందారు. కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన రెండు రోజులు క్రితం గుంటూరులోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చేరారు. ఆరోగ్యం విషమించడంతో శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. పత్రికా రంగంలో సుదీర్ఘకాలం పాటు జర్నలిస్టుగా ఆయన పనిచేశారు. సాక్షి దినపత్రిక చీరాల ఆర్‌సీ ఇన్‌చార్జిగా పనిచేస్తున్నారు. అలానే ఏపీయూడబ్ల్యూజే ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన భౌతికకాయాన్ని చీరాలలోని జర్నలిస్టులు పట్టణంలో ర్యాలీగా స్థానిక హరిప్రసాద్‌నగర్‌లోని ఆయన స్వగృహానికి తరలించారు.
ఆయన మరణవార్త తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కరణం వెంకటేష్‌బాబు, మాజీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తిలు ఫోన్‌లో కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామన్నారు. చీరాల నియోజకవర్గంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, రాజకీయ పార్టీల నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. శనివారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.