
‘దామిని లైట్నింగ్’ యాప్‌తో ముందస్తు సమాచారం
పిడుగుపడే 7–25 నిమిషాల్లోపు మొబైల్‌కు హెచ్చరికలు
యాప్‌లో మూడు రంగుల ద్వారా సంకేతాలు
పూణేలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ రూపకల్పన
జాగ్రత్తలు పాటిస్తే బయటపడొచ్చంటున్న నిపుణులు
బెల్లంకొండ : వర్షం మొదలయ్యే ముందు తరచూ మన ఫోన్లకు విపత్తుల శాఖ నుంచి ‘మీ ప్రాంతంలో పిడుగులు పడే అవకాశం ఉంది’.. అంటూ మెసేజ్‌లు రావడం గమనిస్తుంటాం. పిడుగు ఎప్పుడు పడుతుందో.. ఎలా పడుతుందో ఎవరికీ తెలీని పరిస్థితి. కొన్ని సందర్భాల్లో ప్రాణనష్టం కూడా సంభవిస్తుంది. ఇక ఇంట్లోని గృహోపకరణాలు కూడా కాలిపోతుంటాయి. పిడుగులో ఉండే కాంతి ప్రభావంవల్ల నష్టం భారీగానే ఉంటుంది.
ఈ పరిస్థితుల్లో పిడుగు నుంచి రక్షించుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల శాఖ ఎప్పటికప్పుడు మెసేజ్‌ల రూపంలో హెచ్చరికలు జారీచేస్తూనే ఉంటుంది. అయితే, ఈ పిడుగు ప్రమాదాన్ని అరగంట ముందే గుర్తించేందుకు ‘దామిని లైట్నింగ్’ మొబైల్ యాప్ ఉంది. పూణే కేంద్రంగా ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ (ఐఐటీఎం) దీన్ని రూపొందించింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో 83 చోట్ల ప్రత్యేక సెన్సార్లను అమర్చింది.
‘కాపర్’తో పిడుగుకు చెక్..
ఇంటి పరిసరాల్లో కాపర్ ఎర్త్ వైర్ ఏర్పాటుతో పిడుగుపాటు నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. ఇంటి ఆవరణలో కొంత ఎత్తయిన ప్రదేశం నుంచి నేరుగా భూమిలోకి కాపర్ ఎర్త్ (రాగి వైర్‌ను అనుసంధానం చేస్తూ భూమిలోకి పాతాలి) ఏర్పాటుచేయడం ద్వారా దాదాపుగా కిలోమీటర్ దూరంలో పడిన పిడుగును నేరుగా భూమిలోకి ఇదే ఆకర్షించుకుంటుంది. ఎర్త్ వైర్‌ను ఏర్పాటుచేసే సమయంలో ఉప్పు, కర్ర బొగ్గు, నీటి మిశ్రమాలతో రాగి వైరు కలిగిన పైప్/ఇనుప రాడ్డును భూమి లోపలికి పాతడంవల్ల ప్రమాదాలకు నివారించవచ్చు.
ఎలా ఉపయోగించాలంటే..
ముందుగా ఫోన్లో గూగుల్ ప్లేస్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్‌లోకి వెళ్లి.. దామిని లైటింగ్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. తర్వాత పేరు, మొబైల్ నంబరు, అడ్రస్, పిన్‌కోడ్‌తో రిజిస్టర్ చేసుకోవాలి. జీపీఎస్ లొకేషన్ తెలుసుకునేందుకు యాప్‌కు అనుమతివ్వాలి. మీ ప్రాంతంలో పిడుగుపడే అవకాశం ఉందో లేదో తెలుసుకునేందుకు వీలుగా మూడు రంగులను చూపిస్తుంది. వాటి ఆధారంగా మీరున్నచోట ప్రమాదాన్ని ముందే హెచ్చరిస్తుంది.
రంగుల సంకేతం ఇలా..
ఎరుపు రంగు : మీరున్న ప్రాంతంలో మరో ఏడు నిమిషాల్లో పిడుగుపడే అవకాశం ఉంటే ఆ సర్కిల్ ఎరుపు రంగులోకి మారుతుంది.
పసుపు రంగు : మరో 10–15 నిమిషాల్లో పిడుగుపడే అవకాశముంటే సర్కిల్ పసుపు రంగులోకి మారుతుంది.
నీలం రంగు : 15–25 నిమిషాల్లో పిడుగుపడే అవకాశముంటే ఆ సర్కిల్ నీలం రంగులోకి మారిపోతుంది.
ఇలా జాగ్రత్త పడండి..
» వర్షంపడే సందర్భంలో చెట్ల కింద ఉండకూడదు. ముఖ్యంగా ఎత్తైన చెట్టు కింద అస్సలు ఉండకూడదు.
» ఉరుములు మెరుపులతో కూడిన వర్షం వస్తే రైతులు పొలాల వద్ద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదు.
» పిడుగులుపడే సమయంలో లక్షల డిగ్రీల ఉష్ణోగ్రతతో విడుదలయ్యే వేడి ఒక్కసారిగా మనిషిని చేరగానే గుండెపై ప్రభావం చూపుతుంది.
» వర్ష సూచన ఉన్నప్పుడు గొడుగులపై ఇనుప బోల్టులు, సెల్‌ఫోన్లు, కెమెరాలు దగ్గర లేకుండా చూసుకోవాలి. ఫోన్ల నుంచి వచ్చే సిగ్నల్ పిడుగుపడే అవకాశాన్ని ఎక్కువ చేస్తుంది.
» పిడుగులవల్ల విద్యుత్ ఉపకరణాలు కాలిపోయే అవకాశం ఉంది. ఆ సమయంలో టీవీలకు ఉన్న విద్యుత్ కేబుల్ కనెక్షన్లు తొలగించాలి.
» వర్షం పడుతున్న సమయంలో విద్యుత్ తీగల కింద, ట్రాన్స్‌ఫార్మర్ల సమీపంలో ఉండకూడదు. తడి ప్రదేశాల్లో ఉండకపోవడం చాలా మంచిది.
అప్రమత్తంగా ఉంటే ప్రమాదాలకు దూరం..
వర్షం పడుతున్న సమయంలో బయటకు వెళ్లకుండా ఉంటే మంచిది. ఒకవేళ వెళ్లాల్సి వస్తే ‘దామిని లైట్నింగ్’ యాప్ ఉపయోగించి పిడుగు ఎక్కడ పడుతుందో.. ఏ సమయంలో పడుతుందో తెలుసుకోవచ్చు. తద్వారా ప్రమాదానికి గురికాకుండా సురక్షితంగా ఉండవచ్చు. – ప్రవీణ్‌కుమార్, తహసీల్దార్, బెల్లంకొండ