
ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ఘటన
కావలి–నెల్లూరు మధ్యలో కిడ్నాపర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
చీమకుర్తి: ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ఓ బాలిక కిడ్నాప్‌నకు గురైంది. బాలిక తండ్రి తనకు చెల్లించాల్సిన డబ్బులు ఇవ్వట్లేదనే కారణంతో ఓ వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు. వివరాలు.. మువ్వావారిపాలేనికి చెందిన కె.శ్రీనివాసరావు కుమార్తె చీమకుర్తిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. తిరుపతికి చెందిన ఈశ్వర్‌రెడ్డి శుక్రవారం పాఠశాల వద్దకు వెళ్లి బాలికను బయటకు పిలిపించాడు.
తమ కుటుంబానికి తెలిసిన వ్యక్తే కావడంతో.. ఈశ్వర్‌రెడ్డి మాయమాటలు నమ్మిన బాలిక అతని బైక్ ఎక్కింది. అనంతరం తిరుపతి వైపు బయలుదేరిన ఈశ్వర్‌రెడ్డి.. కొద్దిసేపటికి బాలిక తండ్రికి ఫోన్ చేశాడు. తనకు ఇవ్వాల్సిన రూ.5 లక్షలు ఎన్నిసార్లు అడిగినా ఇవ్వనందున.. నీ కుమార్తెను కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నానని చెప్పాడు. దీంతో బాలిక తండ్రి చీమకుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సీఐ సుబ్బారావు వెంటనే కిడ్నాపర్ ఫోన్ నంబర్‌ను ట్రేస్ చేయించారు. నెల్లూరు జిల్లా కావలి వైపు వెళ్తున్నట్లు గుర్తించి.. సిబ్బందితో కలిసి రంగంలోకి దిగారు. కిడ్నాపర్‌ను కావలి–నెల్లూరు మధ్యలో అదుపులోకి తీసుకొని.. బాలికను రక్షించారు.