దుర్గగుడికి విద్యుత్ నిలిపివేసి అభాసుపాలైన చంద్రబాబు
డ్యామేజ్ కంట్రోల్ చేసే పనిలో సీఎం, విద్యుత్ శాఖ మంత్రి
దుర్గగుడి ఈవో, విద్యుత్ అధికారులతో మంత్రి సమావేశం
జనవరి 6న విద్యుత్, దేవదాయ శాఖ మంత్రులతో ఉన్నతస్థాయి సమీక్ష
సాక్షి, అమరావతి: ప్రసిద్ధిగాంచిన విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని తొలిసారిగా చీకట్లు అలముకున్నాయి. ఈ నెల 27న దాదాపు మూడున్నర గంటలపాటు దుర్గ గుడికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జరిగింది చిన్న పొరపాటు కాదు. చేసింది ప్రైవేటు సంస్థలో.. వ్యక్తులో కాదు. విజయవాడ ప్రధాన కేంద్రంగా సీఆర్‌డీఏతో పాటు ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలకు విద్యుత్ సరఫరా చేసే ఏపీ సీపీడీసీఎల్.
అదీగాక సాక్షాత్తూ కనకదుర్గ ఆలయానికి విద్యుత్ సరఫరా నిలిపివేయడమంటే అదేదో కిందిస్థాయి సిబ్బంది తీసుకునే నిర్ణయం కాదు. ఉన్నతాధికారుల అనుమతి తప్పనిసరి. కానీ.. మాకేం తెలియదంటూ ఎవరికివారు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోయడంతో పాటు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతుండటంతో ప్రభుత్వం పరువు పోయింది.
నిర్లక్ష్యంపై 4 రోజులకు కళ్లు తెరిచిన సీఎం చంద్రబాబు విద్యుత్ శాఖ మంత్రిని వివరణ కోరడంతో పాటు ఈ విషయాన్ని ‘డైవర్షన్’ చేయాలని ఆదేశించారు. రంగంలోకి దిగిన మంత్రి గొట్టిపాటి మంగళవారం దుర్గగుడి ఈవో, విద్యుత్ అధికారులతో మంత్రి సమావేశమైన అనంతరం మీడియా ముందుకు వచ్చారు.
అధికారులపై నెపం
దుర్గగుడిలో విద్యుత్ అంతరాయం అంశాన్ని కొందరు రాజకీయం చేయడం దురదృష్టకరమని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. కనకదుర్గమ్మ గుడిలో సుమారు 15 నిమిషాల పాటు (వాస్తవంగా 3 గంటలు) విద్యుత్ అంతరాయం కలగడానికి గల కారణాలపై దేవదాయ, విద్యుత్ శాఖాధికారులతో సమావేశం నిర్వహించినట్టు చెప్పారు. అధికారుల మధ్య సమన్వయం లోపం వల్లే విద్యుత్ సరఫరా నిలిచి పోయిందన్నారు.
దీనిపై వెంటనే నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించినట్టు తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. జనవరి 6, 7 తేదీల్లో దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆధ్వర్యంలో మరోసారి దుర్గ గుడి ఈవో, ముఖ్య అధికారులతో కలిసి సమావేశం కానున్నట్టు ప్రకటించారు.
పెద్దలకు తెలిసే..
దుర్గగుడికి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంలో తమ తప్పేమీ లేదంటున్న ప్రభుత్వం అధికారుల మీద నెపం నెట్టేసే ప్రయత్నం చేస్తోంది. అమ్మవారి ఆలయానికి విద్యుత్ సరఫరా నిలిచిపోవడం ఇదే మొదటిసారి కాదు. అక్టోబర్‌లో దసరా ఉత్సవాలు అనంతరం దేవస్థానానికి చెందిన పది సర్వీసులకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అప్పుడే సీఎంగానీ, మంత్రిగానీ దృష్టి సారించి ఉంటే ఇప్పుడు మరోసారి ఆ పరిస్థితి వచ్చేది కాదు. కనకదుర్గమ్మను దర్శించుకోవడానికి వెళ్లిన ఏపీ సీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డికి సైతం ఆలయ అధికారులు సమస్యను విన్నవించి పరిష్కరించాలని కోరారు.
ఆయన ఏమాత్రం పట్టించుకున్నా ఇప్పుడిలా విద్యుత్ సరఫరా ఆగేది కాదు. అదీగాక దుర్గగుడికి విద్యుత్ సరఫరా ఆపడమంటే అది కచ్చితంగా డిస్కం సీఎండీకి, ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా, వారి అనుమతి లేకుండా జరిగే అవకాశం లేదు. అప్పుడు నిర్లక్ష్యంగా ఉండి.. తీరా అభాసుపాలవ్వడంతో అధికారుల సమన్వయ లోపం వల్లే పొరపాటు జరిగిందంటూ తమ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.
సాంకేతిక వివరాలేవి?
దేవస్థానం పరిధిలో ఉన్న సౌర విద్యుత్ ప్లాంట్ నుంచి ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను గ్రిడ్‌కు సరఫరా చేస్తున్నారు. దీనికి కచ్చితంగా నెట్ మీటరింగ్ విధానాన్ని అనుసరించాల్సి ఉంది. అది సక్రమంగా జరిగితే ఆ కేంద్రం నుంచి ఉత్పత్తి అయిన విద్యుత్‌కు బదులుగా డిస్కం నుంచి విద్యుత్‌ను వినియోగించుకున్నప్పటికీ ఎలాంటి విద్యుత్ బిల్లు చెల్లించే అవసరం రాకపోవచ్చు. కానీ.. ఏవో సాంకేతిక కారణాలను సాకుగా చూపించి రూ.3.08 కోట్ల బకాయిలు చెల్లించాలని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఇదేమీ గుట్టుగా ఉండే విషయం కాదు. ప్రతీదీ అధికారికంగా ఆన్‌లైన్‌లో నమోదై ఉండాల్సిందే. కానీ.. ఇంతవరకూ బకాయిలకు సంబంధించిగానీ, నెట్ మీటరింగ్‌కు సంబంధించిగానీ అధికారిక పత్రాలను, వివరాలను విద్యుత్ శాఖ బయటపెట్టలేదు. మరోవైపు మూడున్నర గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోతే కేవలం 15 నిమిషాలేనంటూ విద్యుత్ శాఖ మంత్రి అసత్యాలు వల్లె వేస్తున్నారు.


