సిబ్బంది పట్టించుకోకపోవడంతో సోషల్ మీడియాలో తమ ఆవేదన తెలియజేసిన భక్తులు
వైరల్‌గా మారిన వీడియో
ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు
దేవాలయాల విషయంలో బాబు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇన్ని దారుణాలంటూ మండిపాటు
దేవస్థానం ఇన్‌చార్జ్ ఈవోను వివరణ కోరిన దేవదాయ కమిషనర్
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో సోమవారం మహాపచారం చోటుచేసుకుంది. పరమ పవిత్రంగా భావించే పులిహోర ప్రసాదంలో నత్త కనిపించడంతో భక్తులు షాక్‌కు గురయ్యారు. దీనిపై దేవస్థానం సిబ్బంది సరిగ్గా స్పందించకపోవడంతో.. ఇద్దరు భక్తులు తమ ఆవేదనను తెలియజేస్తూ సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేశారు. ‘దర్శనం అనంతరం మేము పులిహోర ప్రసాదం ప్యాకెట్ తీసుకున్నాం.
పులిహోర తింటున్నప్పుడు అందులో నత్త వచ్చింది. కౌంటర్ వద్దకు వెళ్లి ప్రశ్నిస్తే.. వారు సరిగ్గా సమాధానమివ్వకుండా ఆ ప్యాకెట్‌ని తీసేసుకున్నారు. ఇంకో ప్యాకెట్ ఇచ్చేసి వెళ్లిపొమ్మన్నారు’ అంటూ ఇద్దరు భక్తులు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ప్రభుత్వంపై భక్తులు, నెటిజన్లు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పన్న పులిహోర ప్రసాదానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని.. దాని విషయంలో కూడా అజాగ్రత్తగా ఉండడం దారుణమని మండిపడ్డారు.
దేవాలయాల విషయంలో చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పదేపదే దారుణాలు చోటుచేసుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింహాచలం దేవస్థానం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా.. ఏప్రిల్ 30న జరిగిన చందనోత్సవంలో నాసిరకంగా నిరి్మంచిన గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందారని.. జూలైలో భారీ షెడ్ కూలిపోయిందని.. ఇప్పుడు ప్రసాదంలో నత్త కనిపించిందని.. వీటన్నింటికీ చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్య తీరే కారణమని మండిపడ్డారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
కాగా, నత్త విషయాన్ని భక్తులు తమ దృష్టికి తేలేదని ప్రసాదాల విభాగం ఏఈవో రమణమూర్తి చెప్పారు. వారు సోషల్ మీడియాలో పోస్టు చేసుకున్నారని, ప్రసాదాల విక్రయశాల సిబ్బంది ద్వారా తనకు విషయం తెలిసిందన్నారు. ఈ ఘటనపై దేవస్థానం ఇన్‌చార్జ్ ఈవో సుజాతను దేవదాయ శాఖ కమిషనర్ వివరణ కోరినట్లు తెలిసింది.


