
మీ కోసం అర్జీలు తక్షణమే పరిష్కరించాలి
ఒంగోలు సబర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి అందిన అర్జీలను క్షుణంగా పరిశీలించి నాణ్యతతో సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా జిల్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా అధికారులు, పీజీఆర్‌ఎస్ ఆడిట్ టీమ్ అధికారులతో సమావేశమయ్యారు. శాఖల వారీగా పీజీఆర్‌ఎస్‌పై పూర్తిస్థాయిలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ, సర్వే సెటిల్మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్, పంచాయతీ రాజ్, ఎడ్యుకేషన్, ఏపీసీపీడీసీఎల్, మునిసిపల్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, దేవాదాయ తదితర శాఖలకు సంబంధించి ప్రజల నుంచి వివిధ సమస్యలపై ఎక్కువ అర్జీలు వస్తున్నాయన్నారు. పరిష్కరించిన అర్జీలు తిరిగి రీ ఓపెన్ కాకుండా సంబంధిత అధికారులు కరెక్ట్ ఎండార్స్‌మెంట్ ఇచ్చారా లేదా అని, అర్జీదారులు సంతృప్తి చెందారా లేదా అని ఆడిట్ టీమ్ కచ్చితంగా పరిశీలించాలని ఆడిట్ టీమ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి అందిన అర్జీల్లో 47,200 అర్జీలను పరిష్కరించగా, 42,487 అర్జీలను ఆడిట్ చేశారని, అలాగే రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీల్లో 16,834 అర్జీలను పరిష్కరించగా, 16,796 అర్జీలను ఆడిట్ చేసినట్లు చెప్పారు. రీ సర్వేకు సంబంధించి గ్రామ సభల్లో వచ్చిన అర్జీల్లో 8,624 అర్జీలను పరిష్కరించగా, 8,609 అర్జీలను ఆడిట్ చేసినట్లు పీజీఆర్‌ఎస్ నోడల్ అధికారి పీవీఎస్‌పీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీధర్ రెడ్డి వివరించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, సర్వే ల్యాండ్ రికార్డ్స్ అధికారి గౌస్ బాషా, దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ పానకాల రావు, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ శ్రీనివాస నాయక్, కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్ సెక్షన్ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.