
ప్రజా కళలతోనే సమాజంలో మార్పు సాధ్యం
ఒంగోలు టౌన్: ప్రజా కళలతోనే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని, నేటికీ జానపదాలకు, పౌరాణిక సాహిత్యానికి ప్రజాదరణ ఏమాత్రం తగ్గలేదని ప్రముఖ వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన రోజుల్లో కూడా బాహుబలి సినిమాను ఎంత మంది చూశారో పల్లె కన్నీరు పెడుతుందన్న పాటను అంతకుమించి చూశారని చెప్పారు. సీపీఐ రాష్ట్ర మహాసభల సందర్భంగా జరుగుతున్న కళా ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ఎంసీఏ భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కళలను కార్పొరేట్ శక్తులు తమ గుప్పిట్లోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని, ఇందులో భాగంగా ప్రేక్షకులను వ్యసనపరులుగా మార్చడం, సమాజంలో భయభ్రాంతులను సృష్టించడం, హింసాప్రవృత్తిని పెంచిపోషించడం వంటి వాటిని ప్రమోట్ చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటి సినిమాలు బూతు సాహిత్యంతో దుర్వాసన వేస్తున్నాయని, తప్పుడు చరిత్రలను సినిమాలుగా నిర్మించి ప్రజల మెదళ్లలో విషం నింపుతున్నారని మండిపడ్డారు. ఇదే సినిమా రంగంలో అనేక మంది గొప్ప దర్శకులు వచ్చారని, ప్రపంచం మెచ్చే సినిమాలను నిర్మించారని అన్నారు. రాచరికంతో కూడిన హింసాప్రవృత్తిని పెంచిపోషిస్తున్న సినిమాలను ప్రజలు తిరస్కరించాలని పిలుపునిచ్చారు. ఇటీవల ఏకకాలంలో 27 పుస్తకాలను నిషేధించడం గురించి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ అక్షరాన్ని నిషేధించడం మూర్ఖత్వమని, పాలకుల పిరికితనానికి నిదర్శనమన్నారు. ఒక పుస్తకాన్ని పాలకులు నిషేధిస్తే దాన్ని ప్రజలు గుండెల్లో దాచుకుంటారని చెప్పారు. తాను ఎమ్మెల్సీగా చట్టసభల్లో ప్రజల వాణిని బలంగా వినిపిస్తున్నానని తెలిపారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గుజ్జుల ఈఽశ్వరయ్య మాట్లాడుతూ కళారూపాలను ఆయుధంగా చేసుకొని సీపీఐ అనేక పోరాటాలను నిర్మించిందన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో బండెనక బండికట్టి పాటతో ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన కమ్యూనిస్టులు 10 లక్షల ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచిపెట్టారని అన్నారు. అశ్లీల సాహిత్యానికి, అశ్లీల సినిమాలకు ప్రత్యామ్నాయంగా ప్రజా కళలను ప్రజలు ఆదరించాలని కోరారు. సమావేశంలో ప్రజా నాట్యమండలి నాయకులు చంద్రా నాయక్, రామకృష్ణ, చిన్నం పెంచలయ్య, పాట వెంకన్న, శ్రీశైలం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.