
సమాజాన్ని సజీవంగా ఉంచేది కళలే
ఒంగోలు టౌన్: ప్రజల్లో నిత్య చైతన్యాన్ని రగిలిస్తూ సమాజాన్ని సజీవంగా ఉంచేది కళలేనని సినీ దర్శకుడు బాబ్జీ చెప్పారు. ‘‘ఒక్క రోజైనా ఒక్కసారైన కమ్యూనిస్టుగా బతుకు నేస్తమా’’ పాటతో ప్రసిద్ధుడైన ఆయన సీపీఐ రాష్ట్ర మహాసభలను పురస్కరించుకొని నిర్వహిస్తున్న కళా ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఒంగోలు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం గతంలో ఎన్నడూ లేనంతగా దేశం సంక్షోభంలో కూరుకొనిపోయిందన్నారు. దేశ ప్రజల సంపదపై కార్పొరేట్ శక్తులు పెత్తనం కొనసాగిస్తున్నారని, దోపిడీ మరింతగా పెరిగిపోయిందని, అవినీతి వ్యవస్థీకృతమైందని ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యుడు స్వేచ్ఛగా మాట్లాడలేని దుస్థితి దాపురించిందన్నారు. ప్రజలు నమ్మకమైన ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఇలాంటి సంక్షోభ సమయంలో కవులు, కళాకారులే ప్రజల గొంతుకలను బలంగా వినిపిస్తున్నారన్నారు. ప్రజలను చైతన్యం చేస్తున్నారు కనుకనే గౌరీ శంకర్, ధబోల్కర్, స్టాన్ స్వామిలను తీరోగమన శక్తులు హతమార్చారని, ప్రజల్లో ఆలోచన రెకెత్తిస్తున్నందుకే ప్రజా యద్దనౌక గద్దర్ గుండెల్లో తూటాలు దించారని ఆరోపించారు. పాలకులు ఎంత అణచివేతకు గురిచేస్తున్నా, ఎన్ని ఆంక్షలు విధిస్తున్నా కవులు, కళాకారులు గళం విప్పి మాట్లాడుతూనే ఉన్నారని చెప్పారు. ఈ క్రమంలోనే ప్రజలను జోలపాడి నిద్రపుచ్చడానికి పాలకులు సినిమా మాధ్యమాన్ని ఎన్నుకున్నారని తెలిపారు. చరిత్ర పేరుతో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని, సినిమా రంగాన్ని కార్పొరేట్ శక్తులు తమ గుప్పిట్లోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తోందన్నారు. చట్టసభల్లో కమ్యూనిస్టులు లేకపోవడం వలన వారికి వచ్చిన నష్టమేమీ లేదని, దేశానికి, ప్రజలకే ఎక్కువ నష్టం జరుగుతుందని వ్యాఖ్యానించారు. అధికార రాజకీయాలు చేయకుండా ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేస్తున్న కమ్యూనిస్టులను ఆదరించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ఒంగోలులో జరుగుతున్న సీపీఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.