
భూములపై కన్నేసి!
హార్బర్, ఎయిర్‌పోర్టుల పేరుతో హంగామా జిల్లా కేంద్రానికి సమీపంలో భూ దందాకు రంగం సిద్ధం కొత్తపట్నం మండలంలో ప్రభుత్వ భూములు కాదని ప్రైవేటు భూముల సేకరణ ఎయిర్ పోర్టు పేరుతో అల్లూరు వద్ద 1088 ఎకరాల భూముల సేకరణకు రంగం సిద్ధం 2014–19లో ఇదే తరహాలో హడావుడి చేసి పునాది కూడా వేయని బాబు సర్కార్ దొనకొండ ఎయిర్ పోర్టును గాలికి వదిలేసినట్లేనా ? పాలకుల మాటలపై నమ్మకం లేదంటున్న స్థానికులు ప్రభుత్వ భూములను వదిలిపెట్టి ప్రైవేటు భూముల సేకరణపై అనుమానాలు
గాలి కొదిలేసి..
విమానాశ్రయం పేరుతో 1088 ఎకరాల సేకరణ
కొత్తపట్నం సముద్రతీరం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు:
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కరేడు భూముల వ్యవహారంలో ఒకవైపు వివాదం కొనసాగుతున్న తరుణంలోనే మరోవైపు కొత్తపట్నం మండంలోని భూములపై కన్నేయడంపై ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కొత్తపట్నం మండలంలోని తీరప్రాంతాల భూములపై కన్నేసిన అధికార పార్టీ నాయకులు ఇక్కడి ప్రజలకు ఎయిర్ పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తామని చందమామ కబుర్లు చెబుతున్నరన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2014–19లోనూ నాటి చంద్రబాబు ప్రభుత్వం ఇదే తరహాలో హడావుడి చేసింది. ఒక్క పునాదిరాయి కూడా వేయకుండానే గద్దె దిగిపోయింది. తాజాగా ఇప్పుడు కూడా అదే విధంగా మళ్లీ హడావుడి మొదలు పెట్టింది. అయితే ఈసారి తీరప్రాంతంపై కన్నేసి పెద్ద సంఖ్యలో భూముల సేకరణకు రంగం సిద్ధం చేసుకుంటోంది. దీంతో కూటమి ప్రభుత్వ తీరు మీద ప్రజలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే విమానాశ్రయాలు కట్టి ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తారా లేకపోతే ఆ పేరుతో వేల ఎకరాలు అప్పనంగా కాజేస్తారా అని గుసగుసలాడుకుంటున్నారు.
దొనకొండ విమానాశ్రయం గాలికి..
గత ఎన్నికల ప్రచారంలో దొనకొండ విమానాశ్రయాన్ని పునరుద్ధరిస్తామని పశ్చిమ ప్రకాశం ప్రజల్లో ఆశలు రేపి అధికారంలోకి వచ్చింది. ఆ తరువాత దొనకొండ విమానాశ్రయం ప్రాంతంలో కలెక్టర్, ఇతర జిల్లా అధికారులు పరిశీలించి వెళ్లారు. ఆ తరువాత ఏం జరిగిందో ఏమో కానీ దొనకొండ విమానాశ్రయం సంగతి మరిచిపోయారు. ఏడాదిన్నర అవుతున్నా ఇటువైపు తొంగిచూసిన పాపాన పోలేదు. ఈలోపు ఒంగోలులో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడంతో దొనకొండ ప్రజలు ప్రధానంగా పశ్చిమ ప్రకాశం ప్రజలు విస్తుపోయారు. దొనకొండ విమానాశ్రయాన్ని పక్కన పెట్టేయడం వారిని నిరాశకు గురి చేస్తోంది. ఎందుకంటే గతంలో చంద్రబాబు ప్రభుత్వం దొనకొండను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని హంగామా చేసింది. పారిశ్రామిక హబ్ పేరుతో ఆర్భాటంగా ప్రచారం చేసుకుంది. ఐదేళ్లు పరిపాలన చేసినప్పటికీ కనీసం ఒక్కటంటే ఒక్క పరిశ్రమను కూడా దొనకొండకు తీసుకొని రాలేకపోయిందన్న విమర్శను మూటకట్టుకుంది. ఇపుడు అధికారంలోకి వచ్చిన తరువాతైనా దొనకొండను అభివృద్ధి చేస్తారేమో అనుకుంటే ఉన్న విమానాశ్రయాన్ని కూడా లేకుండా చేశారు. దాంతో దొనకొండకు విమానాశ్రయం రాదు.. పరిశ్రమలు రావని ప్రజలు నిర్ణయించుకున్నారు. చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయామని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒంగోలు సమీపంలో ఎయిర్ పోర్టు నిర్మించనున్నట్లు ప్రకటించింది. ఢిల్లీ నుంచి వచ్చిన బృందం ఇక్కడి భూములను పరిశీలించి వెళ్లింది. కొత్తపట్నం మండలంలోని అల్లూరు వద్ద ఎయిర్ పోర్టు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. జనవరిలో ఒంగోలుకు వచ్చిన కేంద్ర విమానయాన సంస్థ కమిటీ సభ్యులు అల్లూరు భూములను పరిశీలించి వెళ్లారు. అల్లూరులో విమానాశ్రయం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతో రెవెన్యూ అధికారులు భూసేకరణకు రంగం సిద్ధం చేశారు. ఇందుకోసం మొదటి దశలో 657 ఎకరాల భూమిని సేకరించాలని రెవెన్యూ అధికారులు నిర్ణయించారు. ఈ 657 ఎకరాల భూమిలో వాన్‌పిక్ కు చెందిన 551 ఎకరాలు, పట్టా భూమి 103 ఎకరాలు, ప్రభుత్వ భూమి 12 ఎకరాలు సేకరించనున్నారు. తదుపరి దశలో మిగతా భూములను సేకరిస్తారు. అయితే 1088 ఎకరాలతోనే ముగిస్తారా లేక అదనంగా మరిన్ని ఎకరాల భూములను సేకరిస్తారా అనేది తేలాల్సి ఉంది. ఇక్కడ విమానాశ్రయం ఏర్పాటుకు రెండు దశాబ్దాలకు ముందే బీజం పడింది. అయితే అది కార్యరూపం దాల్చలేదు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడినప్పుడల్లా ఆ పార్టీ ప్రజాప్రతినిధులు హడావుడి చేసి తర్వాత అది మరుగునపడిపోవడం షరా మామూలుగా మారింది.