
ఆస్తిలో వాటా ఇవ్వలేదని నిరాకరణ
ప్రకాశం జిల్లా: ఆస్తిలో వాటా పంచి ఇవ్వలేదన్న కారణంతో కన్న తల్లి అంత్యక్రియలు చేసేందుకు కుమారులు ముందుకురాలేదు. ప్రకాశం జిల్లా పొదిలి మండలం మూగచింతల గ్రామానికి చెందిన నల్లబోతుల పుల్లయ్య, వీరయ్య దంపతులకు ఐదుగురు కుమారులు. వీరికి 2.45 ఎకరాల పొలం, రెండు చోట్ల 14 సెంట్ల స్థలం ఉంది.
20 ఏళ్లుగా వీరి కుటుంబంలో ఆస్తి విషయంలో గొడవలున్నాయి. తల్లిదండ్రులు మొదటి ముగ్గురు కుమారులకు ఆస్తి పంపకంలో వాటా ఇవ్వకుండా చివరి ఇద్దరు కుమారులకే వాటా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆదివారం తల్లి వీరమ్మ మృతిచెందింది. మృతదేహాన్ని చూసేందుకు కుమారులంతా వచ్చినా.. కర్మకాండలకు అయ్యే ఖర్చును ఆస్తి తీసుకున్న కుమారులే భరించాలని మొదటి ముగ్గురు కుమారులు మెలిక పెట్టారు. దీనిపై వారి మధ్య వాదోపవాదాలు జరిగాయి. చివరకు అంత్యక్రియలు నిలిచిపోయాయి.