
మార్కాపురం, ప్రకాశం జిల్లా: ఫారెస్ట్ అధికారులు, ఉద్యోగులపై దాడికి పాల్పడిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌ను అరెస్ట్ చేసి పదవి నుంచి తొలగించాలని ఫారెస్ట్ అసోసియేషన్ నాయకులు నిరసన చేపట్టారు. ఒకవేళ బుడ్డాపై ఎటువంటి చర్యలు తీసుకోలేకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఫారెస్ట్ అధికారులుపై దాడి చేపనప్పటికీ బుడ్డాపై చంద్రబాబు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై నిరసనను ఉధృతం చేశారు.
ఈ క్రమంలోనే ఏపీ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ అసోసియేషన్ నాయకులు బుడ్డాపై చర్యలకు డిమాండ్ చేస్తున్నారు. నల్లమలలో అటవీ సిబ్బందిపై శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ దాడికి పాల్పడటం ఇప్పుడు రాష్ట్రంలో కలకలం రేపుతోంది. శ్రీశైలం శిఖరం చెక్ పోస్ట్ వద్ద ఫారెస్ట్ వాహనాన్ని ఆపి తమపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, ఆయన అనుచరులు దాడి చేశారంటూ ఫారెస్ట్ సిబ్బంది ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.
ఎమ్మెల్యే దాడి విషయాన్ని ఫారెస్ట్ సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఫారెస్ట్ వాహనాన్ని ఎమ్మెల్యే తానే నడుపుతూ.. సిబ్బందిని వాహనంలో ఎక్కించుకెళ్లినట్లు సమాచారం. అర్ధరాత్రి 2 గంటల వరకు ఫారెస్ట్ సిబ్బందిని ఎమ్మెల్యే, ఆయన అనుచరులు తిప్పినట్లు తెలిసింది.
ఫారెస్ట్ గార్డ్ గురవయ్యపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి అనుచరులు దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. మేం చెప్పినట్టు వినడం లేదని ఎమ్మెల్యే దాడి చేశారంటున్న ఫారెస్ట్ సిబ్బంది.. డిపార్ట్‌మెంట్ వాహనాన్ని కూడా ఎమ్మెల్యే లాక్కున్నారంటూ ఆరోపిస్తున్నారు.