
ఒంగోలు: ప్రేమ పేరుతో బాలికను మభ్యపెట్టి పలుమార్లు అత్యాచారం చేసిన కేసులో దోషికి 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ ఒంగోలు పోక్సో కోర్టు న్యాయాధికారి కానుగుల శైలజ బుధవారం తీర్పు చెప్పారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గొట్టిపాటి శ్రీనివాసరావు తెలిపిన మేరకు.. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలానికి చెందిన బాలిక తల్లిదండ్రులతో కలిసి ప్రతి ఆదివారం అల్లూరు గ్రామంలో చర్చికి వెళ్లేది. ఆ చర్చిలో మైకు ఏర్పాటుచేసే బత్తుల చంటి అలియాస్ విల్సన్ బాలికతో పరిచయం పెంచుకున్నాడు.
ఇంటర్ చదువుతున్న ఆ బాలికను మభ్యపెట్టి ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. కొన్నాళ్లకు బాలిక అనారోగ్యంగా ఉంటుండడంతో తల్లిదండ్రులు ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేయించారు. బాలిక గర్భం దాల్చినట్లు వెల్లడైంది. తల్లిదండ్రులు నిలదీయడంతో బాలిక చంటి అలియాస్ విల్సన్ గురించి చెప్పింది. బాలిక తల్లిదండ్రులు 2019 ఆగస్టు 6న కొత్తపట్నం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అప్పటి ఎస్.ఐ. మేడా శ్రీనివాసరావు కేసు నమోదు చేశారు.
అప్పటి డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి.ప్రసాద్ కేసు దర్యాప్తు చేసి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. కోర్టులో ఇరువైపుల వాదనలు విన్న న్యాయాధికారి నిందితుడు చంటి అలియాస్ విల్సన్‌పై నేరారోపణ రుజువైందని ప్రకటించారు. దీంతో దోషికి 20 ఏళ్ల జైలుశిక్ష, రూ.10 వేల జరిమానా విధించారు. బాధితురాలికి రూ.3 లక్షలు, ఆమె బిడ్డకు రూ.3 లక్షలు అందేలా చూడాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థను ఆదేశించారు.